Mobile Popup Ad
Mobile Popup Ad

జూన్ 4లోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కలం, వరంగల్ బ్యూరో: ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను జూన్ 4వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy)తో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన కలెక్టర్లు ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు, నిల్వ, రవాణా ప్రక్రియలపై మంత్రులకు వివరించారు. ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు ఉమ్మడి జిల్లాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులతో కలిసి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో గన్నీ సంచుల కొరత లేదని స్పష్టం చేసిన మంత్రి, ఈ యాసంగి సీజన్‌కు అవసరమైన 24 కోట్ల గన్నీ సంచులను కొనుగోలు కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అవసరమైన ప్రాంతాలకు అదనపు గన్నీ సంచులను వెంటనే పంపిస్తున్నామని పేర్కొన్నారు. వాతావరణ శాఖ జూన్ 4వ తేదీ తర్వాత వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించిన నేపథ్యంలో, జూన్ 3వ తేదీలోగా ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. కొనుగోలు, రవాణా, నిల్వ, రైతులకు చెల్లింపుల ప్రక్రియను సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇసుక రవాణాకు వినియోగిస్తున్న లారీలను తాత్కాలికంగా ధాన్యం రవాణాకు మళ్లించాలని సూచించారు. అవసరమైతే లారీలు, డీసీఎంలను రిక్విజిషన్ చేసి ధాన్యం, మొక్కజొన్న తరలింపునకు వినియోగించాలని ఎస్పీలు, ఆర్టీఏ అధికారులకు సూచించారు. జిల్లాల వారీగా గోదాములలో నిల్వ స్థలాల కేటాయింపుపై పరస్పర సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను ఆదేశించారు. జనగామ జిల్లాకు యాదాద్రి జిల్లాలో, వరంగల్ జిల్లాకు భూపాలపల్లి జిల్లాలో నిల్వ స్థలాలు కేటాయించాలని సూచించారు. అవసరమైతే ప్రైవేట్ గోదాములను కూడా వినియోగించుకోవాలని కలెక్టర్లకు తెలిపారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన రైస్ మిల్లులకు వెంటనే తరలించాలని, రైతులకు ఇబ్బంది కలిగించేలా తాలు, తరుగు పేరుతో కోతలు విధించే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్‌కు సంబంధించి 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటివరకు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. మరో 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8.5 లక్షల మంది రైతులకు రూ.10,500 కోట్ల చెల్లింపులు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసినా చేయకపోయినా రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించే రైస్ మిల్లర్లకు అదనపు బాయిల్డ్ రైస్ టార్గెట్ల కేటాయింపు చేస్తామని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఆర్డీవోలు, సివిల్ సప్లై అధికారులు, రవాణా, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

రైతులు పండించిన ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేసే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని ఆదేశించారు. తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసే రైస్ మిల్లర్లపై తహసీల్దార్లు, సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాల మధ్య గోదాముల కేటాయింపుల విషయంలో కలెక్టర్లు, పౌర సరఫరాల కమిషనర్ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఫైనాన్స్‌ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, వర్షన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ జిల్లాల కలెక్టర్లు చాహాట్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, బొర్ఖడే హేమంత్ సహదేవ్ రావు, సందీప్ కుమార్ ఝా, డిసిపి ధార కవిత కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>