Mobile Popup Ad
Mobile Popup Ad

మూతబడిన పాఠశాలలకు మహర్దశ..!

కలం, వరంగల్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలలకు (Govt Schools) పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు టీచర్లు, స్థానిక సర్పంచ్ లు ఇంటింటా తిరుగుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి మూతబడిన స్కూళ్లను సైతం రీ ఓపెన్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. డ్రాపౌట్స్ పెరగకుండా దూరం ప్రాంతం నుండి స్కూల్ కు వచ్చే పిల్లలకు ప్రభుత్వ నుంచి రవాణా భత్యం కూడా చెల్లించేలా జిల్లా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి స్కూల్ ను పక్కాగా నడిపించేందుకు ప్రణాళిక రూపొందించటంలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది.

పూర్వ వైభవం కోసం..

ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో 3,369 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ప్రైవేటు స్కూళ్ల ఎఫెక్ట్ తో సర్కార్ స్కూల్లో విద్యార్థులు చేరకపోవడం, ఉపాధ్యాయుల కొరత, రేషనలైజేషన్ తదితర కారణాలతో గడిచిన ఐదేండ్లలో చాలా స్కూళ్లు మూత పడ్డాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తంగా 474 స్కూళ్లు జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉండగా అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 167, వరంగల్ జిల్లాలో 135, జనగామ 70, హనుమకొండ 36, ములుగు 36, జయశంకర్ భూపాలపల్లిలో 30 పాఠశాలల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్ నమోదైనట్లు విద్యాశాఖ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

మూతబడిన పాఠశాలల రీ ఓపెన్

మూతబడిన పాఠశాలల పునః ప్రారంభించి అధిక సంఖ్యలో విద్యార్ధులను చేర్పించాలనే పట్టుదలతో విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నర్సింగరావు పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులు లేక పన్నెండేళ్ల కిందట మూతపడింది. ఆ పాఠశాలలో విద్యార్ధులను చేర్పించి పునః ప్రారంభించాలనే పట్టుదలతో జిల్లా విద్యాశాఖ అధికారుల ప్రోత్సాహంతో స్థానిక సర్పంచ్ యాద శోభారాణి కుమార్ దంపతులు రూ.2.5 లక్షలు ఖర్చు చేసి, ఆ స్కూల్ బిల్డింగ్ ను రిపేర్ చేయించారు. రంగులతో అందంగా ముస్తాబు చేయడంతో పాటు విద్యార్థులను చేర్పించి, ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు 60 స్కూళ్లకు పైగా తిరిగి తెరిపించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు విద్యాశాఖ అదికారులు చెబుతున్నారు.

సూదూర ప్రాంతాల విద్యార్థులకు రవాణా ఖర్చులు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యను పెంచి స్కూళ్లకు పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు సర్కార్ అనేక సంస్కరణలు చేపట్టింది. దూర ప్రాంతాల నుంచి బడికి వచ్చే విద్యార్థులకు రవాణా భత్యం అందించేలా ప్లాన్ చేశారు. ప్రభుత్వం రెండేండ్ల నుంచి ఈ రవాణా భత్యం అందిస్తుండగా.. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సాయం అందేలా చూస్తున్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ప్రైమరీ స్కూల్ కు ఒక కిలోమీటర్, యూపీఎస్ కు 3 కిలోమీటర్లు, హై స్కూల్ కు 5 కిలో మీటర్లకు పైగా దూరం నుంచి వచ్చే విద్యార్థులకు నెలకు రూ.600 చొప్పున తల్లిదండ్రులు, పిల్లల జాయింట్ అకౌంట్ లో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

అందరి సహకారంతో…

మూత పడిన స్కూళ్లను తిరిగి ప్రారంభించుకోవడంపై ఫోకస్ పెట్టామ‌ని హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజు చెప్పారు. స్థానిక సర్పంచుల సహకారంతో పాఠశాల‌ల్లో విద్యార్థులను చేర్పించే బాధ్యత తీసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న‌ట్లు తెలిపారు. చాలా చోట్ల సర్పంచులు ముందుకొచ్చి సర్కారు బడులు తిరిగి తెరచుకునేలా చర్యలు చేపడుతున్నార‌న్నారు. స్కూళ్లో విద్యార్ధులను చేర్పించేందుకు ఇన్ఛార్జ్ లను నియమించి, ప్రభుత్వం స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>