కలం, ఖమ్మం బ్యూరో: ఏళ్లుగా అధ్వాన్న స్థితిలో ఉండి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న భద్రాచలం–వాజేడు రహదారికి (Bhadrachalam-Vajedu Road) ఎట్టకేలకు మరమ్మతుల దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల ఈ మార్గంలో ప్రయాణించిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును (Minister Tummala) స్థానికులు అడ్డుకుని రహదారి దుస్థితిని వివరించారు. కేవలం 100 కిలోమీటర్ల ప్రయాణానికి మూడు గంటల సమయం పడుతోందని, రోడ్డు పరిస్థితి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి తుమ్మల వెంటనే ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు.
పరిపాలనా అనుమతులు వచ్చినప్పటికీ పనులు ప్రారంభించని కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. వారం రోజుల్లోగా పనులు ప్రారంభించకపోతే కాంట్రాక్టర్‌ను తొలగించి కొత్త టెండర్లు పిలవాలని ఏపీ మంత్రిని విజ్ఞప్తి చేశారు. దీనికి బీసీ జనార్దన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. మొత్తం 112.6 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారిని రూ.115.28 కోట్ల అంచనా వ్యయంతో మూడు ప్యాకేజీలుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 7.8 కిలోమీటర్ల రహదారిని రూ.3.70 కోట్లతో, భద్రాద్రి డివిజన్ పరిధిలోని 56.8 కిలోమీటర్ల రహదారిని రూ.67.58 కోట్లతో, ములుగు డివిజన్ పరిధిలోని 48 కిలోమీటర్ల రహదారిని రూ.44 కోట్లతో పునర్నిర్మించనున్నారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చే భక్తులు, స్థానిక ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఇరు రాష్ట్రాల అధికారుల పర్యవేక్షణలో పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. త్వరితగతిన రహదారి అభివృద్ధి పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.

