కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ అవతరణ దినోత్సవ ( Telangana Formation Day) వేడుకల్లో ఒక ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అధికారిక వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన ప్రసంగాన్ని సగానికే ముగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంకా ఐదు పేజీల అధికారిక ప్రసంగ పాఠం మిగిలి ఉండగానే ఆయన తన ప్రసంగానికి స్వస్తి పలికారు. భానుడి భగభగల కారణంగా పరేడ్ గ్రౌండ్స్‌లో ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో, అక్కడకు వచ్చిన ప్రజలు, అధికారులు, సిబ్బంది ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే తాను ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేస్తున్నట్లు ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు.
రాష్ట్రంలో ఎండల తీవ్రతను ముందే ఊహించిన ప్రభుత్వం, వాస్తవానికి ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ వేడుకలను రెండు గంటలు ముందుకు జరిపి, ఉదయం 8 గంటలకే ప్రారంభించింది. అయినప్పటికీ ఎండ వేడిమి వేగంగా పెరగడంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రసంగం పూర్తికాకపోయినప్పటికీ, ఎండల దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.

