Mobile Popup Ad
Mobile Popup Ad

నకిలీ విత్తనాలపై జీరో టాలరెన్స్ అమలు చేయాలి: మంత్రి తుమ్మల

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో నకిలీ విత్తనాలపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Thummala Nageswara Rao) స్పష్టం చేశారు. సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులు, విత్తన కంపెనీ ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, విత్తన కంపెనీలతో సమన్వయం కొనసాగించాలని సూచించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గతంలో సబ్‌స్టాండర్డ్ విత్తనాలపై కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి నెలాఖరులో కంపెనీలు తమ స్టాక్ వివరాలను ప్రభుత్వానికి అందజేయాలని, సెల్ఫ్ సర్టిఫైడ్ విత్తనాల వల్ల నష్టం కలిగితే కంపెనీలే భరించాలని సూచించారు.

నకిలీ విత్తనాల (Fake Seeds)పై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని మంత్రి సూచించారు. జిల్లా నుండి మండల స్థాయివరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. అక్రమ నిల్వలు, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా లూస్ కాటన్ విత్తనాల అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని సూచించారు. విత్తనాల సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు లైసెన్సింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. జీఓటీ ఫెయిల్ అయిన పత్తి విత్తనాలను పూర్తిగా వినియోగానికి అనర్హంగా ప్రకటించాలన్నారు. అదేవిధంగా కో మార్కెటింగ్ విధానంలో ఏ కంపెనీ విత్తనాన్ని, ఏ కంపెనీ, ఏ పేరుతో అమ్ముతుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని, సీడ్ యాక్ట్ లో ఉన్న కొన్ని లోపాలను కంపెనీలు అవకాశంగా మార్చుకొని రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలను తమ ప్రభుత్వం ఉపేక్షించదని తెలిపారు. అవసరమైతే కో మార్కెటింగ్ పూర్తి రద్దుచేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాల నిర్మూలన కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>