కలం, ఖమ్మం బ్యూరో : ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రతి ఎకరానికి రూ.51 వేలు సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తెలిపారు. ఆదివారం కొణిజెర్ల మండలంలో పర్యటించి అంజనాపురంలో ఏర్పాటు చేస్తున్న గోద్రెజ్ ఆయిల్ పామ్(GODREJ OIL PALM) ఫ్యాక్టరీ పనుల పురోగతిని, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆయిల్ పామ్ మొక్కలు తీసుకొచ్చి మొదటిసారిగా నాటడం జరిగిందని అన్నారు. అప్పటివరకు మనకు ఈ పంట లేదని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా ఆయిల్ పామ్ పంట విస్తరణ కోసం అనుమతులు తాను సాధించినట్లు మంత్రి తెలిపారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి కొణిజర్లలో గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి కోరడం జరిగింది.
అలాగే పంటల మార్పిడి చేసుకోలేకపోతే రైతులు ఇబ్బందులు పడతారని తెలిపారు. ధాన్యం కొనుగోలును కేంద్ర ప్రభుత్వం క్రమంగా తగ్గిస్తుందని అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో వరి పంట వేయకపోతే డబ్బులు ఇస్తున్నారు. యూరియా అధిక వాడకంతో పంజాబ్ లో క్యాన్సర్ ఎక్కువ అయిందని, ప్రస్తుతం మన దగ్గర కూడా యూరియా ఎక్కువగా వాడుతున్నామని దీనివల్ల నష్టాలు వస్తాయని అన్నారు. పంటల మార్పిడి విధానం రైతులు తప్పని సరిగా అనుసరించాలని లేని పక్షంలో చాలా నష్టాలు వస్తాయని మంత్రి అప్రమత్తం చేశారు. మల్టీ నేషనల్ కంపెనీ గోద్రెజ్ వ్యవసాయ ఉత్పత్తులపై దృష్టి సారించిందని, ఏపీలో గతంలోనే ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారని ప్రస్తుతం ఖమ్మంలో ఫ్యాక్టరీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు.
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీతో పాటు ఇక్కడ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతులకు ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఈ నెల 22న సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ చేతుల మీదుగా జరిగే నూతనంగా నిర్మించిన నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రైతులందరూ వెళ్లాలని, అక్కడ 3 రోజుల పాటు వ్యవసాయ ప్రదర్శన ఉంటుందని అన్నారు. సీడ్ గార్డెనింగ్ ఏర్పాటుకు కంపెనీలకు ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా సహకారం అందిస్తామని తెలిపారు. సీడ్ గార్డెనింగ్ కోసం రైతుల దగ్గర్నుంచి భూమి తీసుకునే సమయంలో వారు సంతోషంగా ఉండేలా పరిహారం అందించాలని మంత్రి ఆదేశించారు.

