నాణ్యమైన విత్తనాలనే రైతులకు అందుబాటులో ఉంచాలి: తుమ్మల

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఖరీఫ్ సాగు నాట్ల సమయానికి నాణ్యమైన విత్తనాలనే రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Thummala Nageswara Rao) ఆదేశించారు. సచివాలయంలో వ్యవసాయశాఖ, సీడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్, విత్తన కంపెనీ ప్రతినిధులతో గురువారం మంత్రి సమీక్ష చేపట్టారు. వానాకాలం 2026 సాగు సన్నాహకంలో భాగంగా ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి విత్తనాల లభ్యతను కంపెనీల వారీగా, పంటల వారీగా సమీక్షించారు. రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలే అందుబాటులో ఉంచాలని మంత్రి స్పష్టం చేశారు. వానాకాలం 2026లో రాష్ట్రంలో సుమారు 134.66 లక్షల ఎకరాల్లో సాగు జరిగే అవకాశం ఉందని ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. దానికి 19.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని అంచనా వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, అవసరానికి దాదాపు రెండింతలు నిల్వలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

పత్తి సాగు విషయంలో సుమారు 52 లక్షల ఎకరాల లక్ష్యంతో, రైతులకు అవసరమైన 104 లక్షల ప్యాకెట్లకు బదులుగా 212.11 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. హైబ్రిడ్ విత్తనాల లభ్యతపై ప్రత్యేకంగా చర్చించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న విత్తనాలను ప్రాధాన్యంగా సరఫరా చేయాలని మంత్రి సూచించారు. విత్తనాల నాణ్యతపై ఎలాంటి రాజీ పడకూడదని చెప్పారు. సీడ్ టెస్టింగ్ ల్యాబ్‌ల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరపాలన్నారు. వరి సన్నరకాల ఎంపికలో రైతులు, మిల్లర్లు, వినియోగదారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, అంతర్జాతీయ ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా ఎంపిక చేయాలని మంత్రి సూచించారు. కంపెనీలు తమ విత్తనాల స్టాక్‌ను మే 15 నుండి రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

నకిలీ విత్తనాల నిఘా గురించి మంత్రి మాట్లాడుతూ, జిల్లా నుండి మండల స్థాయివరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసి, అక్రమ నిల్వలు, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా లూస్ కాటన్ విత్తనాల అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని సూచించారు. మట్టిసారాన్ని పెంపొందించే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రికి అధికారులు తెలిపారు. వానాకాలం 2026లో 1.95 లక్షల క్వింటాళ్ల పంపిణీకి రూ.134 కోట్లు వ్యయం చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి తెలిపారు.

ఈ సమావేశంలో సీడ్ కార్పోరేషన్ డెవలప్ మెంట్ చైర్మన్ అన్వేష్ రెడ్డి వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, మార్క్ ఫెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>