కలం, వెబ్ డెస్క్: ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) స్పష్టం చేశారు. మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్‌కు మరింత గుర్తింపు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తయారీ రంగానికే ప్రాధాన్యత ఇస్తూనే.. డిజైన్, ఇంజినీరింగ్, పరిశోధన విభాగాలను కూడా బలోపేతం చేస్తున్నామని వివరించారు. ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ (ISNT) ఆధ్వర్యంలో హైటెక్స్‌లో నిర్వహించిన ‘నాన్ డిస్ట్రక్టివ్ ఎవాల్యుయేషన్ అండ్ ఎనేబ్లింగ్ టెక్నాలజీస్ జాతీయ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ నగరంలోని ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునేలా స్థానిక పరిశ్రమలను గ్లోబల్ మార్కెట్‌తో అనుసంధానిస్తున్నామని తెలిపారు.
విధానాలు కూడా మారాలి..
ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్డ్ మెటీరియల్స్, ఎమర్జింగ్ టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్న కొద్దీ వాటిని పరీక్షించే విధానాలు కూడా మారాలని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇందుకోసం ఏఐ, డిజిటల్ ట్విన్స్, అడ్వాన్స్డ్ ఇన్స్పెక్షన్ పద్ధతులను వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ యువతను ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారను. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ISNT, పరిశ్రమలు, యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు ముందుకు రావాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో NDE సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.

