కొమురం భీమ్ స్ఫూర్తితో హక్కులను కాపాడుకోవాలి: మంత్రి సీతక్క

​కలం, ఖమ్మం బ్యూరో : మాతృభాష, సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానమే ఆదివాసీల నిజమైన అస్థిత్వమని, ఎంతటి ఉన్నత స్థానాలకు ఎదిగినా తమ మూలాలను మరచిపోకూడదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క) (Minister Seethakka) స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రధాన కూడలిలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన విప్లవ వీరుడు కొమరం భీమ్ విగ్రహాన్ని ఆదివారం మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలసి ఘనంగా ఆవిష్కరించి నివాళులర్పించారు.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొమురం భీమ్ “జల్, జంగల్, జమీన్” నినాదంతో సాధించిన పోరాట స్ఫూర్తితో ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అడవి, భూమి, విద్య, ఉపాధి, గృహ వసతి వంటి ప్రాథమిక అవసరాలు గిరిజనులకు అందేలా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఆదివాసీ ప్రాంతాల నుంచి వినతులు తెచ్చే పేదలు, నిరక్షరాస్యుల సమస్యలను అధికారులు గౌరవంగా, ఓపికతో విని పరిష్కరించాలని ఆదేశించారు.

నియోజకవర్గంలో ఇప్పటికే రూ. 1,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని, రాబోయే రోజుల్లో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, గిరిజన సంక్షేమ శాఖల ద్వారా మరిన్ని నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసీ యువత ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

​అంతకుముందు మంత్రికి స్థానిక ప్రజలు ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు, కొమ్ము డాన్స్‌లతో ఘన స్వాగతం పలికి, పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యా చందన, జెడ్పీసీఈఓ నాగలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు, ఆదివాసీ జేఏసీ నాయకులు, వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గిరిజన ప్రజలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>