కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ వల్లే అధిష్ఠానం తనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిందన్న కొండా సురేఖ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క (Seethakka) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బ్లాక్ మెయిల్ కు భయపడేంత బలహీనంగా అధిష్ఠానం లేదని తెలిపారు. ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు. పార్టీ నిర్ణయాల విషయంలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. క్రమశిక్షణతోనే పార్టీకి గౌరవమన్న ఆమె.. సమస్యలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని సూచించారు. సీఎంపై వ్యాఖ్యలు చేయడంతో అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అంతర్గత వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు భుజాలు ఎగరేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. మహిళా నాయకురాలిని బర్తరఫ్ చేశారని కేటీఆర్ అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే కవితను ఎందుకు బయటకు పంపారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొండా సురేఖ కాంగ్రెస్ లోనే ఉన్నారని.. పార్టీ బలోపేతానికి ఆమెతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు.

