కలం, వెబ్ డెస్క్: తనను అసభ్యకరంగా దూషించిన పోలీస్ కానిస్టేబుల్‌ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో డీజీపీ సీవీ ఆనంద్ చెప్పాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు. కేవలం సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని, కనీసం కేసు కూడా పెట్టలేదన్నారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే మూడేళ్ల జైలు శిక్ష, అలా చేసిన ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టంగా చట్టంలో ఉందన్నారు. డీజీపీకి ఇంట్లో ఇద్దరు కోడళ్లు ఉన్నారని, వారిపై కూడా ఇలాగే అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటారా.. అని నిలదీశారు. పరీక్ష పాసయ్యాకే డీజీపీ అయ్యారా.. లేకపోతే రికమండేషన్‌లో వచ్చారా అంటూ ఫైర్ అయ్యారు.
డీజీపీ వచ్చాకే క్రైం రేట్ పెరిగింది..
20 ఏళ్ల ప్రజా జీవితంలో ఉండి ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసి, ఒక పార్టీ అధ్యక్షురాలైన తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. ఇక సామాన్య మహిళల ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. సీవీ ఆనంద్ డీజీపీ అయ్యాకే రాష్ట్రంలో క్రైం రేటు పెరిగిందన్నారు. నక్సలైట్లు అంతమయ్యాక.. గంజాయి స్మగ్లింగ్ పెరిగిందని డీజీపీ ఖమ్మంలో అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. గంజాయి రవాణా కట్టడి చేయాల్సింది పోలీసులే కదా.. అని ప్రశ్నించారు. చేయాల్సిన పనిని పక్కన పెట్టి డీజీపీ క్రికెట్ ఆడుతుంటే అదే పెద్ద న్యూస్ అయిపోతుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తనను దూషించిన కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోకపోతే.. అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రభుత్వ పరువు తీస్తానని హెచ్చరించారు.
ఉద్యమ కారులకు గుర్తింపు ఇవ్వాలి..
సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఉద్యమకారుల కాళ్లు పట్టుకున్నంత పని చేశారని కవిత విమర్శించారు. కోదండరాం ఉద్యమకారులకు ఐడెంటిటీ కార్డులు ఇచ్చారని.. తరువాత వారిని పట్టించుకోవడం మానేశారన్నారు. కోదండరాం ఇచ్చిన ఐడెంటిటి కార్డులను ప్రభుత్వానికి ఇవ్వొచ్చు కదా.. అని ప్రశ్నించారు. ఉద్యమకారులకు ఇప్పటికైనా గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

