కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో మహిళలకు అక్షరాస్యత పెంపొందించడంతో ఉన్నత విద్య అవకాశాలు కల్పించనున్నట్లు మంత్రి సీతక్క (Seethakka) తెలిపారు. ప్రతి స్వయం సహాయక బృందంలో ఉన్న మహిళ చదువులేని మహిళగా ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. వారికి ప్రాథమిక విద్యతో పాటు వారి విద్యార్హతలను గుర్తించి ఉన్నత విద్య అవకాశాలు కల్పించనున్నట్లు వివరించారు. అందుకోసం మహిళా సంఘాల సభ్యులకు ఎడ్యుకేషన్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని అధికారులను సీతక్క ఆదేశించారు. శనివారం బీఆర్కే భవన్‌లోని సెర్ప్ (SERP) కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్‌తో కలిసి డైరెక్టర్లు, జిల్లా మహిలా సమాఖ్య అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మహిళా సంఘాల భవనాల నిర్మాణం, కొత్త సభ్యుల నమోదు, “అమ్మకు అక్షరమాల” కార్యక్రమం, సెర్ప్ పథకాల అమలుపై సమీక్ష చేపట్టారు.
SHG భవనాల నిర్మాణ ప్రగతిపై చర్చ..
గత నెలలో నిర్వహించిన జిల్లా సమాఖ్య సమావేశాలు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కింద అమలవుతున్న కార్యక్రమాలు, గ్రామ స్థాయి SHG భవనాల నిర్మాణ ప్రగతిపై చర్చించారు. నిర్మల్ జిల్లా 100% రుణ చెల్లింపులు సాధించగా, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు గంగవ్వను మంత్రి అభినందించి సత్కరించారు. ఇతర జిల్లాలు కూడా ఆమెను ఆదర్శంగా తీసుకోవాన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల భవనాల నిర్మాణం మిషన్ మోడ్‌లో కొనసాగుతోందని సీతక్క తెలిపారు. మొత్తం 8,227 భవనాలకు అనుమతులు మంజూరు కాగా, 5,239 భవనాలకు భూమి గుర్తించి నిర్మాణం ప్రారంభమైందని చెప్పారు. కొన్ని భవనాలు నిర్మాణమై ప్రారంభోత్సవాలు కూడా జరిగాయని తెలిపారు. జిల్లా సమాఖ్య నాయకులు గ్రామాల సందర్శన చేయాలన్నారు. ప్రస్తుతం 5,000కి పైగా వీఓ భవనాలు నిర్మాణంలో ఉండగా, వచ్చే ఏడాది మరో 5,000 భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. 100% రుణ చెల్లింపులు చేసిన గ్రామాలకు ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సాహకాలు అందించనున్నామని తెలిపారు.
అమ్మకు అక్షరమాల..
ప్రభుత్వం చేపట్టిన “అమ్మకు అక్షరమాల” కార్యక్రమం విజయవంతం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 6 లక్షల మందికి పైగా మహిళలకు సాక్షరత కల్పించగా, త్వరలో మరో 6 లక్షల మందికి గ్రామ స్థాయిలో విద్య అందించనున్నారు.శిశువివాహాలు వంటి సామాజిక సమస్యలను అరికట్టడంలో స్వయం సహాయక బృందాల పాత్ర ముఖ్యమని పేర్కొన్నారు. మహిళలు తమ సమాజాల్లో ప్రభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. మహిళలకు రిజర్వేషన్లు త్వరలో అమలులోకి రానున్న నేపథ్యంలో రాజకీయాల్లో కూడా మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి ప్రతి మహిళ SHGలో సభ్యురాలిగా చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేసవి సెలవుల్లో టీనేజ్ బాలికల కోసం “స్నేహ సమ్మర్ ప్రోగ్రామ్” నిర్వహిస్తూ జీవన నైపుణ్యాలు, విద్య, ఆరోగ్యం, భద్రతపై శిక్షణ ఇస్తామని చెప్పారు.

