99 రోజుల ప్రణాళిక అమలుపై సన్నాహక సమావేశం

కలం, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అమలులో నిజామాబాద్, కామారెడ్డిలతో కూడిన ఉమ్మడి జిల్లాను ముందంజలో నిలపాలని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక (Praja Palana – Pragathi Pranalika) అమలుపై నిజామాబాద్(Nizamabad) కలెక్టరేట్‌లో శుక్రవారం ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు.

జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని ఉమ్మడి జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేయగా, ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి (Bhoopathi Reddy) తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశిష్ సంగ్వాన్‌లు ప్రగతి ప్రణాళిక అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక గురించి ఆయా శాఖలు, అంశాల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా ఇంచార్జి మంత్రి దృష్టికి తెచ్చారు.

ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క(Minister Seethakka) మాట్లాడుతూ.. పల్లెలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా.. ప్రభుత్వం ఆయా శాఖల వారీగా పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ పైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం,  సంక్షేమం, డ్రగ్స్‌కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, క్రీడలు, పర్యావరణం అంశాలలో నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా విజయవంతం అయ్యేలా కృషి చేయాలని అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేస్తూ, ప్రజలకు జవాబుదారీగా పారదర్శకతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ ప్రణాళిక అమలు ద్వారా రానున్న మూడు నెలల వ్యవధిలో ప్రజారోగ్యం, విద్య, వైద్యం, అంగన్వాడీల నిర్వహణ, స్త్రీ శిశు సంక్షేమం, పారిశుధ్యం తదితర అంశాలలో స్పష్టమైన మార్పు కనిపించేలా అంకిత భావంతో పని చేయాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>