కలం, ఖమ్మం బ్యూరో: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం (Khammam) జర్నలిస్టులకు (Journalists) గుడ్ న్యూస్ చెప్పారు. ఇందిరమ్మ మోడల్ హౌస్, అక్రిడేషన్ కార్డులు, అధునాతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు విషయమై సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా ఖమ్మం కేంద్రంలో అధునాతన ‘ప్రెస్ క్లబ్’ నిర్మాణానికి హామీ ఇచ్చారు. శుక్రవారం వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) ఖమ్మం జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్, కో కన్వీనర్లు యెన్నబోయిన శ్రీనివాస రావు, అమరనేని రామకృష్ణ, ఖమ్మం నియోజకవర్గ కన్వీనర్ కె. కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా నాయకులు బొడ్డుపల్లి రవీందర్ మంత్రి పొంగులేటిని కలిశారు. అనంతరం జర్నలిస్టులకు సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో అధునాతన ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలని, ఖమ్మం జిల్లా అక్రిడేషన్ కమిటీలో ‘డబ్ల్యూజేఐ’ ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. అలాగే అక్రిడేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన కొన్ని నిబంధనలను మార్చాలని తెలిపారు. ఇప్పుడున్న ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదని, అందుకే అధునాతన భవనం నిర్మించాలని కోరారు. అలాగే ‘వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా’ ప్రతినిధులకు ఖమ్మం జిల్లా ‘అక్రిడేషన్ కమిటీ’లో స్థానం కల్పించాలని కోరారు. జిల్లా కేంద్రాల్లో పని చేసే జర్నలిస్టులందరికీ కార్డులు మంజూరు చేయాలని కోరగా, మంత్రి పొంగులేటి సానుకూలంగా స్పందించారు.

