కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై కేటీఆర్ ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గురించి మాట్లాడే అంత ఇమేజ్ కేటీఆర్ కి లేదని ఎద్దేవా చేశారు. గాంధీ కుటుంబం మొత్తం దేశం కోసం త్యాగం చేసిందని పేర్కొన్నారు. నేరెళ్ల దళితులపై దాడి, ఖమ్మంలో రైతులకు బేడీలు, మల్లన్న సాగర్ బాధితుల మీద లాఠీ ఛార్జి ఘటనలు జరిగింది బీఆర్ఎస్ పాలనలోనే కదా? అని మంత్రి ప్రశ్నించారు.
పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఇవ్వని గ్రూప్ వన్ నోటిఫిరేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడంతో పాటు నిర్వహించి చూపించిందని పొన్నం గుర్తు చేశారు. హామీలు ఇవ్వడమే కాదు అమలు చేసే సత్తా కూడా ఉందని పొన్నం స్పష్టం చేశారు. “మీలాగా వేల కోట్ల రూపాయల ఆస్తుల సంపాదన మీద ఆసక్తి లేదు.. అవసరం లేదు. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నాం” అని మంత్రి (Ponnam Prabhakar) వెల్లడించారు.
అవినీతి గురించి కేటీఆర్ మాట్లాడడం వింతగా ఉందన్న పొన్నం.. ఫార్ములా ఈ రేస్ కేసులో అవినితీ ఆరోపణలు ఎవరు ఎదుర్కొన్నారో అందరికీ తెలుసన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోల, అసైన్ ల్యాండ్.. ఇలా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ అవినీతి లెక్కలు చెప్పడానికి ఏడాది సమయం పడుతుందని పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

