కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పర్యటన ముగించుకొని వస్తున్న మంత్రి పొంగులేటి (Minister Ponguleti Srinivasa Reddy) బుద్ధారం గ్రామం సమీపంలో రోడ్డు పై ధాన్యం తూకం వేస్తున్న హమాలీలను చూసి, వాహనం దిగి వచ్చి వాళ్ళ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ’పనులు ఎలా జరుగుతున్నాయి? ఆదాయం సరిపోతుందా? ఇంట్లో అందరూ క్షేమమేనా?‘ అంటూ ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించారు. మంత్రి (Minister Ponguleti Srinivasa Reddy) స్వయంగా తమ వద్దకు వచ్చి పలకరించడంతో హమాలీలు సంతోషపడ్డారు.
ఈ సంభాషణలో భాగంగా ఓ హమాలీ తన సోదరుడు క్యాన్సర్‌తో పోరాడుతున్నాడని, వైద్యం చేయించుకోలేక అవస్థలు పడుతున్నామని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. వెంటనే స్పందించిన మంత్రి.. క్యాన్సర్ వ్యాధికి భయపడాల్సిన అవసరం లేదని, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. వైద్యానికి అయ్యే ఖర్చుల విషయంలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకుని, తక్షణమే స్పందించిన మంత్రి పొంగులేటి తీరుపై హమాలీలు, స్థానికులు ప్రశంసల జల్లు కురిపించారు. సామాన్యుడి కష్టాన్ని గుర్తించే నాయకుడు ఉండటం తమ అదృష్టమని వారు హర్షం వ్యక్తం చేశారు.

