కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించి, రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రత కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని అన్నారు.
గురువారం హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరిలతో పాటు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, సాగునీటి విస్తరణే ధ్యేయంగా ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల పురోగతికి అడ్డుగా ఉన్న భూసేకరణ సమస్యలు, అటవీ శాఖ అనుమతులు, నిధుల విడుదల వంటి అంశాలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టులతో పాటు జిల్లాలోని అన్ని ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగవంతం చేసి రైతులకు త్వరితగతిన ఫలితాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా భవిష్యత్తును మార్చే అత్యంత కీలకమైన ప్రాజెక్టుగా నిలుస్తుందని మంత్రి అభివర్ణించారు. పాలేరు లింక్ కెనాల్ ద్వారా కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు, పాత ఆయకట్టును పూర్తిస్థాయిలో స్థిరీకరించే అవకాశం కలుగుతుందని ఆయన వివరించారు. రైతుల అభ్యున్నతి కోసం అవసరమైన ప్రతి ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల వారీగా పనుల పురోగతిని, నిధుల అవసరాలను మంత్రులు, అధికారులు సుదీర్ఘంగా చర్చించారు.

