కలం, నల్లగొండ: ఎస్ఎల్‌బీసీ (SLBC) కాలువ లైనింగ్ పనులను రూ.450 కోట్లతో చేపట్టినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkat Reddy) తెలిపారు. నల్లగొండ మండలం గుండ్లపల్లి గ్రామ సమీపంలో కొనసాగుతున్న ఎస్‌ఎల్‌బీసీ కాలువ లైనింగ్ పనులను మంత్రి పరిశీలించారు. కాలువ లైనింగ్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించి,పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఎల్‌బీసీ కాలువ ఆధునీకరణ ద్వారా సాగునీటి పంపిణీ మరింత సమర్థవంతంగా జరిగి, రైతులకు అధిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. వ్యవసాయ రంగాభివృద్ధి, నీటి వనరుల సమర్థ వినియోగం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. కాలువ లైనింగ్ పనులు పూర్తయితే చివరి భూముల వరకు రైతాంగానికి సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ సీఈ గంగం శ్రీనివాసరెడ్డి, ఎస్ఈ బద్రు నాయక్, ఈఈ నెహ్రూ, డిఈ జితేందర్, ఏఈ గౌతమి, జేఈ శ్రీకాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, గుండ్లపల్లి సర్పంచ్ వంగూరి రమేష్, జానపాటి సతీష్ కుమార్, సూరారపు అనసూయ నగేష్, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జానపాటి రాజేంద్రప్రసాద్, రేగట్టే నాగరాజు, గంగుల సైదులు, చింతల బిక్షపతి, చిమట శ్రీనాథ్, జకిర తాజుద్దీన్, మంగ దొడ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

