కలం, వెబ్ డెస్క్: ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం.. ఎన్నటికీ బాగుపడవు అనే సామెత ఊరికే రాలేదు. ప్రస్తుతం తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఖరీఫ్ పనులు ప్రారంభం కావొస్తున్నా కూడా ఇంకా యాసంగి ధాన్యం సేకరణ పూర్తి కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఇక ప్రస్తుత రోజుల్లో రైతులు పంటను పండించడం ఒక ఎత్తైతే ఆ పంటను కాంటాలు పెట్టి, మిల్లుకు తరలించడం తలకు మించిన భారంగా మారుతుంది. ఒకవేళ మిల్లులకు తరలించినా కూడా తేమ, నూకశాతం, తరుగు పేరుతో కోత పెడతారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు బిక్కు బిక్కుమంటూ జీవితం గడుపుతున్నారు. పండించిన పంటను తేమ, నూకశాతం పేరుతో రైస్ మిల్లర్లు కోత విధించడంతో రైతులు నానా తిప్పలు పడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన రైతుల ధాన్యంలో నిబంధనలకు విరుద్దంగా కోత విధించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. పెద్దముప్పారం గ్రామానికి చెందిన కొండ యాకమ్మ, హనుమండ్ల రమాదేవి, గుర్రం చిన్న వెంకన్న, కసిరెడ్డి గురుపాల్ రెడ్డి దొడ్డు రకం వరి సాగు చేశారు. ఇటీవల ఈ నలుగురు రైతులకు చెందిన ధాన్యాన్ని నెల కిందట కాంటా పెట్టారు. ఆ తరువాత ఆ రైతులకు చెందిన 769 బస్తాల ధాన్యాన్ని మరిపెడలోని హేమధుర్గ రైస్ మిల్ కు లారీలో మే 16న తరలించారు. అయితే దాదాపు నెల రోజులు అయినా ట్రక్ షీట్ రాకపోగా రైతులు అయోమయం చెందారు. తీరా తాజాగా గురువారం ట్రక్ షీట్ రావడంతో స్థానిక ఐకేపీ సెంటర్‌లో పని చేసే నిర్వాహకులు చూడగా రైస్ మిల్లు యాజమాన్యం ఏకంగా 8 బస్తాలు కోత పెట్టి 761 బస్తాలుగా నమోదు చేశారు.
రైతులకు ఐకేపీ నిర్వాహకులు ఈ విషయాన్ని చెప్పగా వారు నిబంధనలకు విరుద్దంగా ఎలా కోత పెడతారని రైతులు ప్రశ్నించారు. అసలు ఇలా కోతలు పెట్టడం చట్ట విరుద్ధమని ప్రభుత్వం చెబుతున్నా రైస్ మిల్లుల యజమానులు మాత్రం పట్టించుకోకుండా ఇష్టారీతిన కోతలు పెట్టి రైతుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. మొత్తం ధాన్యం 769 బస్తాలకు గాను 307.60 క్వింటాలు కాగా 8 బస్తాలు కోత విధించి 761 బస్తాలు 304.40 క్వింటాలకు నమోదు చేశారు. దీనితో రైతులు ఆ మొత్తాన్ని నష్టపోయామని వాపోయారు. గ్రామంలో ఇంకా చాలా మంది రైతుల పరిస్థితి ఇలాగే ఉందని వారు చెప్పుకొచ్చారు. దీనిపై సంబంధిత జిల్లా కలెక్టర్, పౌర సరఫారాల శాఖ అధికారులు, మండల వ్యవసాయాధికారులు విచారణ చేసి రైస్ మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ఆయా కేంద్రాల్లో ఉండే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి జవాబుదారులే అయినా కొనుగోలు కేంద్రాలలో నేరుగా ట్రక్‌షీట్ ఇవ్వకుండా రైసుమిల్లర్ల వద్దకు వెళ్లి అది తీసుకోవాల్సి రావడంతో ఈ పరిస్థితి వస్తుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కోతలు పేరుతో అక్రమాలకు పాల్పడితే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. తూకం వేసిన వెంటనే రైతులకు రసీదుతో పాటు ట్రక్ షీట్ అందించాలని నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

