కలం, వరంగల్ బ్యూరో: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతీఒక్కరికి చేరేలా అధికారులు కృషి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti) తెలిపారు. శుక్రవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం (99 Day Action Plan)పై మహబూబాబాద్ ఐడీవోసీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో “ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక” (Praja Palana Pragati Pranalika) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరతను తీర్చాలని, అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు.
స్లమ్ ఏరియాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని సూచించారు. ప్రభుత్వ బడులను తనిఖీలు చేసి ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. ముఖ్యంగా పాఠశాలల వాహనాల ఫిట్‌నెస్ లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీపీఆర్ఎస్ ద్వారా పాఠశాల వాహనాలను పర్యవేక్షించాలని ఆదేశించారు.
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి: మంత్రి కొండా సురేఖ
ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తెలిపారు. బాలికల వసతి గృహాల్లో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేపట్టాలని సూచించారు. గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ సమావేశంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు, ఎమ్మెల్యేలు మురళీనాయక్, దొంతి మాధవరెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన గుడ్ల ధరలు
Follow Us On: Facebook

