Mobile Popup Ad
Mobile Popup Ad

అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి పొంగులేటి

కలం, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు హనుమకొండ (Hanumakonda) జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రజాహిత పథకాలు, సాధించిన ప్రగతిని వివరించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘనంగా సన్మానించారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ, తెలంగాణ సాధన కోసం చేసిన సేవలు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారులు, విద్యార్థులు తమ ప్రతిభతో వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి, సంక్షేమ ప్రదర్శన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. డీఆర్‌డీఏ, మెప్మా, వైద్య, విద్య, వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక శాఖల పనితీరును సమీక్షించారు.

విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి మంత్రి సేవా పతకాలు, విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అంతకుముందు అదాలత్ సర్కిల్‌లోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద మంత్రి సహా ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అమరవీరుల త్యాగాల పునాదులపై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో  అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>