కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు (Telangana Formation Day) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) మంగళవారం అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు.
వారి పోరాట స్ఫూర్తి వల్లే నేడు మనకు స్వరాష్ట్ర ఫలాలు అందుతున్నాయని, అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణను సుభిక్షంగా తీర్చిదిద్దడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. రాష్ట్రం సాధించిన ప్రగతిలో అమరవీరుల బలిదానం ఎప్పటికీ గుర్తుండిపోతుందని, వారి ఆశయ సాధన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.

