సత్తుపల్లిలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం: మంత్రి పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో రూ.500 కోట్లకు పైగా వ్యయంతో ఉచిత క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం చేసేందుకు సేవా ట్రస్ట్‌లు ముందుకు రావడం అభినందనీయమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. 5 వేల ఉచిత ఇళ్ల నిర్మాణానికి కూడా నిధులు ఇస్తామనడంపై సంతోషం వ్యక్తం చేశారు. శనివారం సత్తుపల్లి మండలంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, కలెక్టర్ దివాకర టిఎస్, సీపీ సునీల్ దత్‌లతో కలిసి జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ​

సత్తుపల్లి మండలం చివరి గ్రామమైన నారాయణపురంలో షిరిడీ సాయి జనమంగళ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న ఉచిత క్యాన్సర్ ఆసుపత్రి, ముందస్తు పరీక్షలు, ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ సేవలను మంత్రి ప్రారంభించారు. రూ.7,000 విలువైన వ్యాక్సిన్లను ఉచితంగా అందించడంపై ట్రస్ట్ నిర్వాహకులను ప్రశంసించారు. ఆసుపత్రికి అవసరమైన రహదారులు, ఇతర వసతుల కల్పనకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని.. తక్షణమే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

దసరాకు ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన..

​బేతుపల్లి గంగారంలో తాన్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య కేంద్రం, ల్యాబ్‌ను మంత్రి పొంగులేటి పరిశీలించారు. ఫౌండేషన్ అధినేత నల్ల ఉదయ్ కుమార్ రెడ్డి దాతృత్వంతో సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని పేదల కోసం రూ.300 కోట్లతో 5 వేల ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం స్థలాలు కేటాయించగానే రాబోయే దసరా పండుగ సందర్భంగా భూమి పూజ నిర్వహిస్తామని, స్థల సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ.. హైదరాబాద్, వేలూరు వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే పనిలేకుండా నారాయణపురం, గంగారంలోనే ప్రపంచ స్థాయి ఉచిత వైద్యం లభించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని తెలిపారు. ఐటీడీఏ పీవో బి.రాహుల్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>