కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) రూరల్ మండలం పొన్నేకల్ గ్రామానికి చెందిన కత్రం సిద్దు అనే కిడ్నీ బాధితునికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) అండగా నిలిచారు. అధికారులతో మాట్లాడి ఆపరేషన్‌కు కావలసిన సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేయించారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మంలోని పొన్నెకల్ గ్రామానికి చెందిన కత్రం సిద్దు అనే వ్యక్తి రెండు కిడ్నీలు దెబ్బతిని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం సుమారు రూ.9 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ నిరుపేద కుటుంబం ఆందోళన చెందింది. ఈ క్రమంలో పొన్నెకల్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నాయకులు బాధితుడి పరిస్థితిని గమనించి అండగా నిలిచారు.
స్థానిక నాయకులు బాధితుడిని తీసుకుని ఖమ్మంలోని మంత్రి క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి (Tumburu Dayakar Reddy) ని కలిశారు. దయాకర్ రెడ్డి బాధితుడి ఆరోగ్య పరిస్థితిని, ఆర్థిక ఇబ్బందులను వెంటనే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి, ప్రభుత్వపరంగా ఎల్వోసీ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి పొంగులేటి ప్రత్యేక చొరవతో, యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 9 లక్షల ఎల్వోసీ మంజూరైంది. కష్టకాలంలో ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద మొత్తంలో సాయం అందేలా చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి బాధితుడు సిద్దు, అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ ప్రక్రియను పర్యవేక్షించిన తుంబూరు దయాకర్ రెడ్డికి, వెన్నంటి నిలిచిన పొన్నెకల్ గ్రామ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.


