కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ప్రజలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి(Ponguleti) శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. రూ.26 కోట్లతో 100 పడకల ఆసుపత్రికి గురువారం శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో కేవలం 30 పడకలతో ఉన్న ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేస్తూ రూ.26 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. గతంలో ప్రసవానికి, అత్యవసర చికిత్సకు ఖమ్మం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం తప్ప మరో మార్గం ఉండేది కాదన్నారు. కానీ, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చాక, జిల్లా హెడ్ క్వార్టర్ ఆసుపత్రిని మరిపించేలా ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. డయాలసిస్ యూనిట్లు, అత్యాధునిక పరికరాలతో కూడిన వైద్యాన్ని రాబోయే కొద్ది నెలల్లోనే ఇక్కడ అందుబాటులోకి తెస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెరిగిందన్నారు. చర్ల, మణుగూరు, ఇల్లందులో ప్రభుత్వ ఆసుపత్రులు మంచి పలితాలు ఇస్తున్నాయని మంత్రి కొనియాడారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదవాడికి నాణ్యమైన చదువు, వైద్యం అందించడమే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. కేవలం వైద్యమే కాదు.. రాబోయే రోజుల్లో విద్యారంగంలోనూ విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి (Ponguleti) శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

