కలం, వెబ్డెస్క్: మతం మారిన వారికి ఎస్సీ హోదా కొనసాగింపుపై సుప్రీం కోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. మత మార్పిడి తర్వాత ఎస్సీ హోదా (SC Status) కోల్పోతారంటూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. 2026 మార్చిలో ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాల్సిన అవసరం లేదని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్లో జోక్యం చేసుకునేలా ఎలాంటి తప్పు కనిపించలేదని పేర్కొంది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు మినహా ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు ఎస్సీ హోదాను కోల్పోతారని కోర్టు మరోసారి స్పష్టం చేసింది.
మతం మారి ఎస్సీ హోదా కోల్పోయిన వారు తిరిగి ఎస్సీ హోదాను పొందేందుకు సుప్రీం కోర్ట్ మూడు షరతులు విధించింది. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతంలోకి మారిన వ్యక్తులు ఈ షరతులను నెరవేరిస్తే ఎస్సీ హోదాను తిరిగి పొందవచ్చని కోర్టు పేర్కొంది. వ్యక్తి మొదట ఎస్సీ కులంలో జన్మించాడని నిరూపించాల్సి ఉంటుంది. మళ్లీ మత మార్పిడి జరిగిందని, పాత మతాన్ని పూర్తిగా వదిలేశాడని కూడా నిరూపించాలి. అలాగే అతడి సామాజిక వర్గం తిరిగి తనను అంగీకరించిందన్న ఆధారాలు చూపించాలి.
ఏపీకి చెందిన ఓ పాస్టర్ మత మార్పిడి అనంతరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు మతం మారిన వ్యక్తి ఎస్సీ హోదా కోల్పోతారని, అట్రాసిటీ చట్టం కింద చేసిన ఫిర్యాదు చెల్లదని తీర్పునిచ్చింది. ఏపీ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది.

