కలం, వెబ్ డెస్క్: తెలంగాణ డిప్యూటీ సీఎం (Deputy CM) భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సోమవారం తన సొంత నియోజకవర్గమైన మధిరలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మధిర ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కిచెన్‌ను ఆయన ప్రారంభించారు. హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం రూపొందించిన అల్పాహారం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక హోమంలో భట్టి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఏ ఒక్క విద్యార్థి కూడా ఖాళీ కడుపుతో ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 26 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి కార్యక్రమం లేదని భట్టి పేర్కొన్నారు. అయితే ఈ అల్పాహార పథకాన్ని ప్రారంభించినప్పుడు అనేక సందేహాలు వ్యక్తం అయ్యాయని, కానీ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. రాబోయే 3 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ అల్పాహార పథకాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు.

