కలం, మహబూబ్ నగర్ బ్యూరో : దేవరకద్ర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యంతో అభివృద్ధి పనులు చేపడుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkat Reddy) అన్నారు. ఆదివారం దేవరకద్ర మండలం మీనుగోనిపల్లి గ్రామంలో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రూ.134.98 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న హామ్ రోడ్డు అభివృద్ధి పనులకు, కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామంలో రూ.40 కోట్లతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి పనులకు మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు.
అనంతరం కురుమూర్తి ఘాట్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. దేవరకద్ర నియోజకవర్గంలో రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, వైద్య, విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రూ.48 కోట్లతో మూడు మండల సమీకృత కార్యాలయ సముదాయాలు కౌకుంట్ల, మూసాపేట, మదనాపూర్ మండలాల్లో ఒక్కో మండల సమీకృత కార్యాలయ సముదాయాన్ని రూ.16 కోట్ల చొప్పున మొత్తం రూ.48 కోట్లతో నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు.
దసరా సందర్భంగా ఈ పనులకు శంకుస్థాపనలు పూర్తి చేసి, నవంబర్ మొదటి వారంలో నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టనున్నట్లు వెంకటరెడ్డి (Minister Komatireddy) ప్రకటించారు. దేవరకద్ర మున్సిపల్ కార్యాలయం నిర్మాణానికి అవసరమైన స్థలానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. దానికి సంబంధించి ప్రత్యామ్నాయ స్థలం కోసం అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌ను కోరారు.
కురుమూర్తి ఘాట్ రోడ్డు పనులకు అనుమతులు
కురుమూర్తి స్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు నిర్మిస్తున్న. ఘాట్ రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు భక్తుల సౌకర్యార్థం గెస్ట్‌హౌస్‌లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. దేవరకద్రకు ప్రత్యేక గుర్తింపు తీసుకురానున్న బ్రహ్మోస్ ప్రాజెక్టు దేవరకద్ర ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు.
ఈ ప్రాజెక్టు కోసం భూములు ఇస్తున్న రైతులకు ఎకరాకు రూ.20 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా అవసరమైన చర్యలు చేపడతామన్నారు. దేవరకద్రలో రూ.100 కోట్లకు పైగా వ్యయంతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం, కోర్టు భవనాలు, డిగ్రీ కళాశాల, మదనాపురం వద్ద రూ.6 కోట్లతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం తదితర అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు మంత్రి వివరించారు. 25 వేల కోట్లతో పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్ట్ 90 శాతం పనులు పూర్తి చేసినట్లు గత పాలకులు చెప్పడం అబద్ధం అన్నారు.
తాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలి: మంత్రి వాకిటి శ్రీహరి
ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న కరవు పరిస్థితుల దృష్ట్యా తాగునీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నీటి లభ్యత తగ్గిన నేపథ్యంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, రైతులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోందన్నారు. నీటి సమస్యపై రాజకీయాలకు తావివ్వకుండా అందరూ సంయమనంతో వ్యవహరించాలని కోరారు. దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాలు అన్నదమ్ముల్లా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
అభివృద్ధి పనులకు మరింత ప్రాధాన్యం: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
దేవరకద్ర నియోజకవర్గంలో గత ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. కురుమూర్తి ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు సుమారు రూ.110 కోట్లతో కొనసాగుతున్నట్లు తెలిపారు. మదనాపురం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని రూ.6 కోట్లతో పూర్తి చేసి ప్రారంభించనున్నట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పనులతో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్.పి. డి. జానకి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ (అండర్ ట్రైనీ) సాయి శివాని, దేవరకద్ర మున్సిపల్ చైర్మన్ దమయంతి, ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.

