కలం, వెబ్ డెస్క్ : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతి (Kalingiri Shanthi )ని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెకు విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో మరోసారి ఆమెను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్బంగా శాంతికి కోర్టు మరోసారి బిగ్ షాక్ ఇచ్చింది. ఆమె రిమాండ్ ను ఈ నెల 19 వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెను అధికారులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
కాగా, శాంతి వద్ద సుమారు 1.37 కోట్ల రూపాయల మేర ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ (ACB) ప్రాథమికంగా గుర్తించింది. ఈ సమాచారం ఆధారంగా ఏప్రిల్ 6న ఆమెపై కేసు నమోదు చేసి, మరుసటి రోజే అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గతేడాది జూలై నుంచి వివిధ ఆరోపణలతో సస్పెన్షన్ లో ఉన్న ఆమెకు హైకోర్టులో ఊరట లభించింది. మార్చి 24న ఆమెపై ఉన్న సస్పెన్షన్ ను హైకోర్టు ఎత్తివేసింది. తిరిగి విధుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే మళ్లీ ఏసీబీ చిక్కుల్లో పడి ఆమె అరెస్ట్ కావడం హాట్ టాపిక్ గా మారింది.

