కలం, జగిత్యాల : ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri) అన్నారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన 13,913 మంది లబ్ధిదారులకు నూతన చేయూత సామాజిక భద్రతా పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఆదివారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కొత్త పింఛన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అర్హులైన పేదలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టామని, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని వివరించారు. అదనంగా అర్హులైన వారికి మరో 2,000 ఇళ్లు మంజూరు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
జిల్లాలో నూతన పింఛన్ల కోసం సుమారు 18,955 దరఖాస్తులు అందగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలించి 13,913 మందిని అర్హులుగా గుర్తించి పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఇంకా అర్హత ఉండి పింఛన్లు పొందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వారి దరఖాస్తులను ప్రత్యేక కౌంటర్ల ద్వారా స్వీకరించి, అధికారులతో క్షేత్రస్థాయిలో విచారణ చేయించి అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లోనూ అర్హులైన వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్పర్సన్లు, డీఆర్డీఏ అధికారులు, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, నూతన పింఛన్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

