కలం, జగిత్యాల: మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ ఫామ్‌హౌస్‌లతో పాటు బీఆర్ఎస్ నాయకుల ఆధీనంలో ఉన్న ఫామ్‌హౌస్‌లలో ప్రభుత్వ భూములు ఉన్నట్లు నిరూపిస్తే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) సవాల్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మారం మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్ వంటి బీఆర్ఎస్ నాయకుల వద్ద ప్రభుత్వ భూమి ఉన్నట్లు సాక్ష్యాధారాలతో నిరూపించి చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుంటామని మంత్రి తెలిపారు.
దళితులంటే చిన్నచూపు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దళితులు అంటే చిన్న చూపు అని మంత్రి లక్ష్మణ్ (Minister Adluri Laxman) ఆరోపించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద దళితులు ధర్నా చేస్తే పసుపు నీళ్లతో శుద్ధి చేసిన సంఘటనపై నేటి వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎందుకు స్పందించడం లేదని మంత్రి ప్రశ్నించారు. దళితులు ధర్నా చేసిన ప్రదేశాన్ని శుద్ధి చేయడంపై బీఆర్ఎస్ ఎస్సీ సెల్ నాయకులు కేసిఆర్ క్షమాపణ చెప్పే విధంగా ఒత్తిడి తీసుకురావాలని అన్నారు.
కేసీఆర్ ఏనాడూ మీటింగ్ నిర్వహించలేదు..
2013 తర్వాత రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులు నమోదైన కేసులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడు సమీక్ష సమావేశం నిర్వహించలేదని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా పాలన లో రెండు రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ హై లెవెల్ సమావేశం నిర్వహించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై సమీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు. దళితులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదో ఇదే నిదర్శనమన్నారు.
ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటాం..
ధర్మారం మండలంలో పేదలకు పంపిణీ చేసిన భూములను పలువురు అక్రమంగా కొనుగోలు చేసి రికార్డులు తారుమారు చేసి అనుభవిస్తున్నారని అడ్లూరి ఆరోపించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణతో పాటు అసైన్మెంట్ భూముల ఆక్రమణపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి ఆర్థికంగా ఉన్న వారి వద్ద ప్రభుత్వ భూములు ఉంటే స్వాధీనం చేసుకొని మండలంలోని పేద ప్రజలకు పెంచుతామని చెప్పారు.
అర్హులైన పేదలకు భూములు..
ధర్మారం మండలంలోని సర్వే నంబర్ 676 పై సమగ్ర విచారణ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సర్వే నంబర్ కు సంబంధించి ఓఆర్సీ ఎప్పుడు ఇచ్చారు? ఇనాం హక్కుదారులు ఎంత మంది ఉన్నారు? ప్రొబిటెడ్ ల్యాండ్ ను పట్టా ల్యాండ్ గా ఎలా మార్చారు? అనే కోణాల్లో విచారణ పూర్తి అవుతుందని తెలిపారు. కొంత మంది సంపన్నులు ఈ భూములు దక్కించుకోవడానికి కోర్టులను ఆశ్రయిస్తున్నారని పేదల భూములు పేద ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మండలంలోని ప్రభుత్వ భూములు సర్వే చేయించి అర్హులైన పేదలందరికీ భూములు పంపిణీ చేస్తామన్నారు.
పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాం..
ధర్మారం మండలం కేంద్రంలో జక్కన్నపల్లితో పాటు ఎమ్మార్వో ఆఫీస్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని లేఔట్ చేసి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తామని మంత్రి తెలిపారు. పార్టీలు, కులాలకు సంబంధం లేకుండా నిజమైన పేదలకు డ్రా పద్ధతిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ వివేక్ చేతుల మీదుగా త్వరలోనే ఏటీసీ(ఐటీఐ) పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి లో ఏటీసీ నిర్మాణం చేస్తామని తెలిపారు.
ధర్మారం మండల సమగ్ర అభివృద్ధికి పలు ప్రణాళికలు తయారుచేసి 100 శాతం అభివృద్ధి జరిగే విధంగా ముందుకు సాగుతున్నమని అడ్లూరి తెలిపారు. మంత్రి వెంట ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రూప్ల నాయక్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రంజిత్ తోపాటు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.
Also Read: బల్మూరి వెంకట్‌పై NSUI స్టేట్ ప్రెసిడెంట్ ఫిర్యాదు!
Follow Us On : WhatsApp

