Mobile Popup Ad
Mobile Popup Ad

మెదక్ అడవులలో వన్యప్రాణులకు తాగునీటి ఏర్పాట్లు.. అటవీ శాఖ చర్యలు

కలం, మెదక్ బ్యూరో :  ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అటవీ ప్రాంతాలలో  వన్యప్రాణులకు (Wildlife) తాగునీటి సమస్య తీవ్రంగా మారుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెదక్ (Medak) జిల్లా అటవీ శాఖ (Forest Department) ప్రత్యేక చర్యలు చేపట్టి జంతువుల ప్రాణ రక్షణకు కృషి చేస్తోంది. జిల్లాలోని నర్సాపూర్ అటవీ ప్రాంతం సహా విస్తారమైన అడవులలో చిరుతలు, హైనాలు, జింకలు వంటి అనేక వన్యప్రాణులు నివసిస్తున్నాయి. సుమారు 57,000 హెక్టార్లకు పైగా అటవీ విస్తీర్ణం ఉన్న మెదక్ జిల్లాలో ఈ అడవులు రాష్ట్రంలోనే ప్రముఖమైనవి. అలాగే పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ వంటి ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా కూడా గుర్తింపు పొందాయి.

వేసవిలో సహజ నీటి వనరులు ఎండిపోవడంతో వన్యప్రాణులు ఇబ్బందులు పడకుండా అటవీ శాఖ కృత్రిమ నీటి కుంటలు, సాకర్ పిట్స్ ఏర్పాటు చేస్తోంది. ట్యాంకర్‌ల ద్వారా నిరంతరం నీరు నింపుతూ, జంతువులు అడవులలోనే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కువగా జంతువులు సంచరించే ప్రాంతాలను గుర్తించి అక్కడే నీటి వసతులు కల్పిస్తున్నారు. అదేవిధంగా చెక్‌డ్యామ్‌లు, కందకాలు నిర్మించి వర్షపు నీటిని నిల్వ చేసేలా చర్యలు చేపట్టారు. పాత చెరువులు, వాగులను శుభ్రం చేసి లోతు పెంచడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతున్నారు. ఈ చర్యల వల్ల జంతువులు గ్రామాల వైపు రావడం తగ్గి, పంట నష్టం, ప్రమాదాలు కూడా తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.

అటవీ అధికారులు తెలిపిన ప్రకారం, రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలోనే దాదాపు 95 సాకర్ పిట్స్ ఏర్పాటు చేసి నీటి సరఫరా చేస్తున్నారు. అవసరమైన చోట బోర్లు వేసి నీటిని అందిస్తున్నారు. కృత్రిమ నీటి వనరులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, నీటి లభ్యతను నిర్ధారిస్తున్నారు. ఈ చర్యల ద్వారా మెదక్ (Medak) జిల్లాలో వన్యప్రాణులు వేసవిలో ఇబ్బంది పడకుండా అటవీ శాఖ సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

Read Also: బీజేపీ కీలక నిర్ణయం.. బెంగాల్ కు మహిళ సీఎం.. !

Follow Us On :  WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>