కలం, తెలంగాణ బ్యూరో: యుద్ధం కారణంగా ముడిచమురు సరఫరాలో ఏర్పడిన చిక్కులతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ-కేవైసీ (e-KYC) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. బోగస్ కనెక్షన్లు, అర్హత లేనివారు, చనిపోయిన వ్యక్తుల పేరుతో కొనసాగుతున్న కనెక్షన్లు, కొన్ని కుటుంబాలకు డబుల్ కనెక్షన్లు ఉండడం.. వీటన్నింటినీ క్రమబద్ధీకరించేందుకు కేంద్రం ఈ విధానాన్ని రూపొందించింది. అర్హులైన కుటుంబాలకు సబ్సిడీ డొమెస్టిక్ సిలిండర్లను సరఫరా చేసేందుకు వారి బయోమెట్రిక్ వివరాలను సమర్పించాలని సూచించింది. దీంతో ఆయిల్ కంపెనీలు కస్టమర్ల వివరాలను ఈ-కేవైసీ పాలసీకి అనుగుణంగా సేకరిస్తున్నది. రాష్ట్రంలో సుమారు 80% వినియోగదారుల ప్ర్రక్రియ పూర్తయిందని, మిగిలిన 20% మేర పూర్తి చేయాల్సి ఉన్నదని పౌరసరఫరాల అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీకల్లా ఈ కేవైసీ చేసుకోకపోతే వారి ఎల్పీజీ (LPG) కనెక్షన్లు రద్దవుతాయని స్పష్టం చేశాయి. దీంతో ఎల్పీజీ డీలర్ల దగ్గర ప్రజలు బయోమెట్రిక్ వివరాలు ఇవ్వడానికి క్యూ కడుతున్నారు.
ఈ-కేవైసీ లేకపోతే నో బుకింగ్స్
డొమెస్టిక్ ఎల్పీసీ కస్టమర్లు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. లేదంటే వారి కనెక్షన్ భవిష్యత్‌లో కట్ కావడంతో పాటు తక్షణం వారికి రీఫిల్లింగ్ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుంది. బుకింగ్ చేసుకోవాలనుకున్నా వీలు పడదు. ఒకవేళ అప్పటికే బుకింగ్ చేసుకుని ఉన్నట్లయితే అవి క్యాన్సిల్ అవుతాయి. ప్రభుత్వం నుంచి సబ్సిడీ కోల్పోవాల్సి ఉంటుంది. కమర్షియల్ సిలిండర్ తరహాలో సబ్సిడీ లేకుండా ఎక్కువ ధరకు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ-కేవైసీ చేయించుకోవాల్సిందిగా కస్టమర్లకు ఆయిల్ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ ఇప్పటికే పలుమార్లు గడువు ఇచ్చినా ఆశించిన స్థాయిలో వంద శాతం ప్రాసెస్ కంప్లీట్ కాలేదు. పలుమార్లు గడువు పొడిగించాయి. ఇప్పుడు చివరి అవకాశంగా ఈ నెల 16 వరకు అవకాశం కల్పించాయి. దీంతో వినియోగదారులు వంట గ్యాస్ డిస్టిబ్యూటర్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు.
చనిపోయినవారి పేరు మీద కనెక్షన్లు
కొన్ని చోట్ల చనిపోయినవారి పేరు మీద ఎల్పీజీ కనెక్షన్లు ఇప్పటికీ కొనసాగుతుండడాన్ని ఆయిల్ కంపెనీలు గుర్తించాయి. దీంతో ఈ-కేవైసీ సమయంలో ఇలాంటివి ఫిల్టర్ అవుతాయని కేంద్రం భావించి.. ప్రతీ డొమెస్టిక్ ఎల్పీజీ కస్టమర్లకు దీన్ని తప్పనిసరి చేసింది. వినియోగదారుల ఆధార్, వేలి ముద్రలు, ఐరిస్ లాంటి బయోమెట్రిక్ వివరాలను ఎల్పీజీ డొమెస్టిక్ కనెక్షన్‌కు అనుసంధానం చేస్తే నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయి.

