జిల్లా రైతులకు నష్టపరిహారం కోసం పార్టీల పొలంబాట

కలం మెదక్ బ్యూరో: ఇటీవల కురిసిన వడగండ్ల వర్షం కారణంగా మెదక్ జిల్లాలో మొత్తం 4777 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. దీనిలో 4700 ఎకరాల వరి పంటకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని చేగుంట,నార్సింగి మండలాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చేగుంట మండలంలోని కర్నాల్ పల్లి, మక్కరాజుపేట్, గొల్లపల్లి, రాంపూర్, కన్యారం గ్రామాలతో వడగండ్ల వాన ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే నష్టపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు వచ్చిన ప్రతిపక్ష , అధికార పక్ష నాయకులు ఇదే అవకాశంగా ప్రత్యర్థి పార్టీపై విమర్శలు చేస్తున్నారు.

ప్రతి ఎకరాకు 25 వేల నష్టపరిహారం ఇవ్వాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

నష్టపోయిన పంట పొలాలను స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్వయంగా శనివారం పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుగాలం చెమటతో పండించిన పంట క్షణాల్లో నేలమట్టం కావడం ఎంతో బాధాకరమని అన్నారు. పంట మాత్రమే కాదు, రైతుల ఆశలు కూడా తుడిచిపెట్టుకు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వడగండ్ల వర్షం దెబ్బకు పంటలు పూర్తిగా నాశనం కావడంతో గడ్డి కూడా మిగలని పరిస్థితి ఏర్పడిందని, అప్పులు చేసి, కౌలు తీసుకుని సాగు చేసిన రైతులు ఈ విపత్తుతో పూర్తిగా ఆగమైపోయారని, ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతులకు ఇది మరింత భారంగా మారిందన్నారు. గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ప్రభుత్వం సరైన సహాయం అందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఎకరాకు కనీసం రూ.25,000 వేల రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు బతికితేనే దేశం బతుకుతుందని స్పష్టం చేశారు.

ఫసల్ భీమా యోజన అమలు చేయాలి: ఎంపీ రఘునందన్

కేంద్ర ప్రభుత్వం ఫసల్ భీమా యోజన అమలు చేయాలని అంటున్నా రాష్ట్ర ప్రభుత్వం తన స్వంత లబ్ది కోసం పథకం అమలును అడ్డుకోవడం వల్లనే “అవ్వ పెట్టదు అడుక్కోనివ్వదు” అనే పరిస్థితి నేడు రైతుకు కలిగిందని మెదక్ ఎంపీ రఘునందన రావు విమర్శించారు. నార్సింగి మండలంలో కురిసిన వడగళ్ల వాన, భారీ వర్షం వల్ల మండలంలోని వరి రైతులు వందల ఎకరాలలో పంటను నష్ట పోయిన విషయాన్ని తెలుసుకున్న రఘునందన్ రావు సోమవారం మండల కేంద్రంలోని పంట పొలాలను సందర్శించారు. రైతుల పంట నష్ట వివరాలను సరైన ఫార్మాట్ లో ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. కొందరు రైతులు తమ భూమితో పాటు మరి కొంత భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తారని, అలాంటి రైతులకు స్వంత భూమి, ఇతరుల భూమికి గల పాస్ పుస్తకాలలో ఉన్న వివరాల ప్రకారం నమోదు చేయాలని అన్నారు. రైతులు కూడా తమ పంట వివరాలను సరిగ్గా నమోదు చేసుకోవలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ భీమా అమలు చేసి ఉంటే నామ మాత్రంగా అందే 5-10 వేలు కాకుండా, పూర్తి నష్ట పరిహారం అందేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకుని రైతుల మేలు కోసం ఫసల్ బీమాను అమలు చేయాలని ఎంపీ రఘునందన రావు డిమాండ్ చేశారు.

పరిహారం అందేలా చూస్తాం: కాంగ్రెస్

వడగాళ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన మెదక్ జిల్లా చేగుంట, నార్సింగి మండలాల్లో నష్ట పోయిన పంటపొలాలు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు పర్యటించి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కోరామని అధికార కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వడగాళ్ల వానతో తీవ్రంగా నష్టపోయరని రైతులకు ప్రభుత్వం తరుపున వెంటనే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలనే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రతిపక్ష బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాజకీయం చేయడం తగదని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>