విద్యార్థులకు టిఫిన్.. సిద్ధమైన సీఎం బ్రేక్‌ ఫాస్ట్ కిచెన్!

కలం, మెదక్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో పోషకాహార లోపం, అనీమియా (రక్తహీనత) వంటి సమస్యలను తగ్గించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం’ (CM Breakfast Scheme) ప్రవేశపెట్టింది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య, హాజరు శాతం పెంచడంతో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరచడమే ల‌క్ష్యంగా ఈ బృహత్తర కార్యక్రమం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా కేంద్రంలో సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభానికి సిద్ధమవుతోంది.

ఇక్కడ విద్యార్ధులకు రుచిర‌క‌మైన, నాణ్య‌మైన టిఫిన్స్ తయారు చేసేలా వ‌స‌తులు, యంత్రాలతో మెగా సెంట్ర‌లైజెడ్ కిచెన్ నిర్మాణం చేస్తున్నారు. మెదక్ జిల్లాతో పాటు కామారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లోని ప్రభుత్వ పాఠ‌శాల‌ల‌కు ఇక్కడి నుంచే అల్పాహారం తరలించనున్నారు. వారం రోజుల్లో ఆరు రోజుల పాటు వివిధ ర‌కాల టిఫిన్లను త‌యారు చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్ కిచెన్’ ఏర్పాటు చేస్తున్నారు.

రూ.5 కోట్ల వ్యయంతో..

మెద‌క్ (Medak) ప‌ట్ట‌ణంలో అత్యాధునిక యంత్రాలతో రోజూ సుమారు ల‌క్ష మంది విద్యార్థులకు అల్పాహారం తయారు చేసేలా సుమారు రూ.5 కోట్ల వ్యయంతో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మించారు. తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ మూవ్‌మెంట్ సంస్థలు 70:30 నిష్పత్తిలో నిధులను సమకూరుస్తున్నాయి. తొలి దశలో భాగంగా మెదక్ జిల్లాలోని 395 పాఠశాలల్లోని దాదాపు 30 వేల మంది విద్యార్థులకు అల్పాహారాన్ని అందించనున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో ఈ కిచెన్ ద్వారా టిఫిన్స్ సరఫరా చేస్తారు. రెండో విడతలో భాగంగా దసరా సెలవుల తర్వాత మెదక్ జిల్లాలోని మిగిలిన అన్ని మండలాలకు విస్తరిస్తారు. సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాలకు తరువాత అందించబోతున్నారు.

ఆరు రోజులు.. ఆరు రకాల టిఫిన్లు..

ఉదయం 5 గంటలకే టిఫిన్లు సిద్ధం చేసి వాహనాల ద్వారా పాఠశాలలకు సరఫరా చేసేలా రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరు రోజుల పాటు ఆరు రకాల రుచికరమైన టిఫిన్స్ అందించ‌నున్నారు. దోశ – చట్నీ, ఇడ్లీ – సాంబార్, పూరీ – ఆలూ కుర్మా, బోండా –చట్నీ, మిల్లెట్ ఉప్మా – చట్నీ, మిల్లెట్ ఇడ్లీ – సాంబార్ అందిస్తారు. టిఫిన్స్‌తో పాటు విజయ డెయిరీ పాలను వారంలో మూడు రోజుల పాటు అందిస్తారు. మ‌రో మూడు రోజులు రాగి జావ అందిస్తారు.

మంత్రి చేతుల మీదుగా..

మెదక్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్‌ను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ (Collector Pratima Singh) పరిశీలించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రజా ప్రతినిధులు చేతుల మీదుగా త్వరలోనే ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన చదువుతో పాటు పౌష్టికరమైన అల్పహారం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ పథకం (CM Breakfast Scheme) వలన ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతమవడంతో పాటు విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. పథకం నాణ్యతను పరీక్షించేందుకు హరే కృష్ణ మూవ్‌మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలల్లో ట్రయల్ రన్ నిర్వహించినట్లు తెలిపారు.

Also Read : చేతకానితనాన్ని ఎల్‌నినో మీద పెడుతున్న రేవంత్.. హరీశ్ రావు ఫైర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>