కలం, ఖమ్మం బ్యూరో: మహిళలు కన్నీరు పెట్టుకున్న రాజ్యం ఎప్పుడూ బాగుపడిన దాఖలాలు లేవని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు విమర్శించారు. వీఓఏ (గ్రామ దీపిక)ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ అశ్వారావుపేట రింగు రోడ్డు వద్ద నాలుగు రోజులుగా వీఓఏలు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ దీక్షా శిబిరాన్ని మంగళవారం మెచ్చా నాగేశ్వరావు సందర్శించి వీఓఏలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సమ్మెలో ఉన్న మహిళల సమస్యలను, వారి ఆవేదనను అడిగి తెలుసుకున్నారు.
వీఓఏలపై చిన్న చూపు ఎందుకు?
అనంతరం మెచ్చా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ… మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా మహిళలైన గ్రామ దీపికలు రోడ్లపై కూర్చొని న్యాయం కోసం దీక్షలు చేస్తుంటే, కాంగ్రెస్ నాయకులు మాత్రం ఏసీ గదుల్లో సేదతీరుతున్నారని మండిపడ్డారు. పాలకులకు మహిళల కష్టం కనబడకపోవడం అత్యంత విచారకరమన్న ఆయన, గ్రామ దీపికలపై ప్రభుత్వం చిన్నచూపు మానుకోవాలని హెచ్చరించారు.
బీఆర్ఎస్ పాలనలో జీతాలు పెంచాం
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే వీఓఏలకు రూ. 3,000 లుగా ఉన్న గౌరవ వేతనాన్ని మాజీ సీఎం కేసీఆర్ రూ. 5,000 లకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో వీఓఏలకు నెలకు రూ. 20 వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. వీఓఏల సమస్యలను బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లి, పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేపడతామన్నారు. అనంతరం, సమ్మెలో ఉన్న గ్రామ దీపికల కోసం బీఆర్‌ఎస్ నాయకురాలు కాసాని నాగ శేష పద్మ ప్రత్యేకంగా తెచ్చిన కొబ్బరి నీళ్లు, భోజనాన్ని మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా వారికి అందజేశారు. ఈ సంఘీభావ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు జూపల్లి రమణారావు, మాజీ జెడ్పీటీసీ సున్నం నాగమణి, ప్రకాశ్, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, గ్రామ దీపికలు పాల్గొన్నారు.

