కలం, స్పోర్ట్స్ : భారత మహిళల హాకీ జట్టుకు కీలక టోర్నీ ముందు భారీ బూస్ట్ లభించింది. ప్రపంచ హాకీలో దిగ్గజ డ్రాగ్‌ఫ్లికర్‌గా పేరున్న డచ్ మాజీ ఆటగాడు టేకే టేకెమా (Teake Taekema) , భారత జట్టుతో ప్రత్యేక శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జరుగుతున్న ఈ క్యాంప్‌లో డ్రాగ్‌ఫ్లికింగ్, పెనాల్టీ కార్నర్ నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జూన్ 15 నుంచి 21 వరకు జరగనున్న FIH మహిళల నేషన్స్ కప్‌కు సిద్ధమవుతున్న భారత జట్టుకు ఈ శిక్షణ కీలకంగా మారింది. చీఫ్ కోచ్ స్జోర్డ్ మారిజ్నే ఆధ్వర్యంలో జట్టు సన్నాహాలు కొనసాగుతున్నాయి.
భారత్ డ్రాగ్‌ఫ్లికర్లు దీపిక, లాల్థంత్లుయాంగి, అన్నూ ప్రస్తుతం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. పెనాల్టీ కార్నర్లను మెరుగ్గా గోల్స్‌గా మార్చడం, దాడి సామర్థ్యాన్ని పెంచడం ఈ శిబిరం ప్రధాన లక్ష్యంగా ఉంది. టేకే టేకెమా ప్రపంచ హాకీ చరిత్రలో అత్యుత్తమ డ్రాగ్‌ఫ్లికర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. నెదర్లాండ్స్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో ఆడిన ఆయన, ఒలింపిక్స్, FIH వరల్డ్‌కప్‌లాంటి పెద్ద టోర్నీల్లో పాల్గొన్నారు. 200కిపైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన టేకెమా, 221 గోల్స్ సాధించి హాకీలో తన ప్రత్యేక ముద్ర వేశారు.
ఈ కార్యక్రమానికి కోకా-కోలా ఇండియా ఫౌండేషన్ ‘ఆనందనా’ మద్దతు ఇస్తోంది. మహిళల హాకీ అభివృద్ధికి తమ సహకారాన్ని కొనసాగిస్తూ, భారత మహిళల జట్టు కోసం బెంగళూరులో ప్రత్యేక గోల్‌కీపింగ్ క్యాంప్‌ను కూడా నిర్వహించింది. ప్రముఖ కోచ్ డేవిడ్ విలియమ్సన్ ఈ శిబిరాన్ని నడిపించారు. న్యూజిలాండ్‌లో జరిగే నేషన్స్ కప్‌కు ముందు భారత్, ఆస్ట్రేలియాతో నాలుగు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడింది. మే 26 నుంచి 30 వరకు పెర్త్ హాకీ స్టేడియంలో జరిగిన ఈ సిరీస్‌లో రెండు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలిచి 2-2తో సమం చేశాయి.
భారత జట్టు జూన్ 3న న్యూజిలాండ్ చేరుకోనుంది. అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్‌లతో మరోసారి సన్నాహాలు ప్రారంభించనుంది. టేకెమా అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని చీఫ్ కోచ్ మారిజ్నే తెలిపారు. ఆధునిక హాకీలో పెనాల్టీ కార్నర్లు చాలా కీలకమని, అందుకే ఆయనలాంటి అనుభవజ్ఞుడి సహకారం విలువైనదని పేర్కొన్నారు. డ్రాగ్‌ఫ్లికింగ్‌తో పాటు రక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా టేకెమా పాత్ర ఉండబోతుందని చెప్పారు.
తాను గతంలో టేకెమాకు కోచింగ్ ఇచ్చిన కారణంగా, ఇద్దరి ఆలోచనా విధానం దగ్గరగా ఉంటుందని మారిజ్నే వెల్లడించారు. జట్టులో ఇప్పటికే మంచి డ్రాగ్‌ఫ్లికర్లు ఉన్నారని, నవ్‌నీత్ కౌర్ వంటి బలమైన స్ట్రైకింగ్ ఎంపిక కూడా ఉందని చెప్పారు. పెనాల్టీ కార్నర్ అవకాశాలను మరింత సమర్థంగా వినియోగించుకోవడం జట్టుకు చాలా అవసరమని, ఈ క్యాంప్ ఆ దిశగా ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

