కలం, వెబ్‌డెస్క్: నేపాల్ వరదల (Nepal Floods)పై భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ వరదల్లో 288 మంది భారతీయులు చిక్కుకున్నట్లు తెలిపింది. మానస సరోవర్‌లో అత్యధికంగా 200 మంది చిక్కుకున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ మేరకు భారత విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ (Randhir Jaiswal) వివరాలు వెల్లడించారు.
గల్లంతైన వారిలో తమిళనాడు నుంచి అత్యధికంగా 86 మంది ఉన్నట్లు తెలిపారు. ఆ తర్వాత బెంగాల్ నుంచి 32 మంది, కేరళ నుంచి 33 మంది ఉన్నారన్నారు. గల్లంతైన వారిలో సద్గురు ఈషా ఫౌండేషన్‌కు చెందిన 80 మంది ఉన్నట్లు తెలిపారు. త్రిశూలీ ప్రాజెక్ట్-1 వద్ద పని చేస్తున్న 73 మంది సిబ్బంది గల్లంతయ్యారన్నారు. ఇప్పటి వరకు 21 మంది భారతీయులను రెస్క్యూ చేసి కాపాడినట్లు తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
బాధిత ప్రాంతాలకు సహాయార్థం భారత్ నుంచి ఇప్పటికే రెండు విమానాల ద్వారా 47.5 టన్నుల అత్యవసర సహాయ సామగ్రిని పంపినట్లు తెలిపారు. ఇందులో షెల్టర్లు, ఆహారం, దుప్పట్లు, సోలార్ లాంతర్లు, మందులు, రెస్క్యూ పరికరాలు ఉన్నట్లు తెలిపారు. వీటితో పాటు బైలీ వంతెనలను కూడా సిద్ధం చేస్తున్నామన్నారు.

