అట్రాసిటీ కేసుల పరిష్కారంపై కలెక్టర్‌ కీలక ఆదేశాలు

కలం, నిజామాబాద్ బ్యూరో: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో (Atrocities Cases) బాధితులకు సత్వర న్యాయం జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ (Nizamabad Collector) భవేష్ మిశ్రా (Bhavesh Mishra) సూచించారు. గురువారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్ల వారీగా అట్రాసిటీ కేసుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, చేపట్టిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కేసుల దర్యాప్తును పకడ్బందీగా నిర్వహించి పూర్తి ఆధారాలు సేకరించి, సకాలంలో చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని సూచించారు.బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం, ఇతర సహాయ సహకారాల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన నివేదికలు, లేఖలను సంబంధిత శాఖల ద్వారా సకాలంలో అందజేయాలని సూచించారు.

ప్రతి నెల సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని, దళిత, గిరిజన వర్గాల ప్రజలకు వారి హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు జీవనాధారం కోసం ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములను ఎవరైనా కబ్జా చేస్తే తన దృష్టికి తీసుకురావాలని, భూభారతి చట్టం ద్వారా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామాలలో సాంఘిక బహిష్కరణ వంటి ఘటనలు చోటుచేసుకుంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు తప్పకుండా అమలయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో అదనపు డీసీపీ శుభం నగ్రాలే, జిల్లా రెవెన్యూ అధికారిణి గీత, జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారిణి రజిత, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఏసీపీలు ప్రకాష్, శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ భాస్కర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>