కలం, వెబ్ డెస్క్: వాయుగుండం ప్రభావంతో రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలపడటంతో దాని ప్రభావం తెలంగాణలోని పలు జిల్లాల మీద ఉంటుందని పేర్కొంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, హననుమకొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతాయని స్పష్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరం ఉంటేనే బయటకు రావాలని సూచించింది. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, వనపర్తి, గద్వాల, నారాయణపేట, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
జలమయమైన హైదరాబాద్..
హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఆ ధాటికి సికింద్రాబాద్, పంజాగుట్ట, ఖైరతాబాద్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల రహదారులు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రెండు మూడు గంటల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని.. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

