ఆ రెండు మండలాలకు కరువు ముప్పు.. సీఎంకు మంత్రి పొన్నం కీలక లేఖ!

కలం, కరీంనగర్ బ్యూరో: ఎల్ నినో ప్రభావంతో కరీంనగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్ (Husnabad) నియోజకవర్గంలో ఉన్న చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, కరువు పరిస్థితుల కారణంగా ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. ఈ నేపథ్యంలో చిగురుమామిడి, సైదాపూర్ మండలాలను కూడా కరువు మండలాలుగా గుర్తించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం లేఖ (Ponnam Letter to CM) రాశారు.

ఎల్ నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఆయా మండలాల్లో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడిందని, రానున్న రోజుల్లో తాగునీటి సమస్యలు సైతం ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు.

హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఇప్పటికే రెండు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా గుర్తించారని, మిగిలిన ఐదు మండలాల్లోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లోని ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఈ రెండు మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని కోరారు.

తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తమ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరుతూ ఆయా మండలాలు, గ్రామాల్లో ప్రజలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలు, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ జిల్లా పరిధిలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాలను కరువు మండలాలుగా గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>