కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో అక్రమ పశువుల రవాణా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చర్ల (Cherla) మండలం కేంద్రంగా భారీ స్థాయిలో గోవుల అక్రమ రవాణా జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల నుండి గోవులను హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు స్మగ్లర్లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సుమారు 1200 గోవులను అక్రమంగా తరలించే యత్నాలు జరుగుతున్నాయనే సమాచారం స్థానికంగా చర్చకు దారి తీసింది. నిబంధనలకు విరుద్ధంగా కంటైనర్లలో పరిమితికి మించి గోవులను నింపి తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూగజీవాలను హింసిస్తూ ఈ రవాణా కొనసాగుతోందని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొంతమంది గోవులను తరలించినట్లు సమాచారం ఉన్నప్పటికీ, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు లేకపోవడం, సంబంధిత అధికారులు స్పందించకపోవడం ప్రజల్లో అనేక సందేహాలకు తావిస్తోంది. స్థానిక అధికారుల నిర్లక్ష్యం లేదా సహకారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున రవాణా జరగదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ గోవులను ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ అక్రమ దందాను వెంటనే అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నారు.
Read Also: కవిత క్షమాపణలన్నీ ఓట్ల కోసమేనా?
Follow Us On : WhatsApp

