కలం, వెబ్ డెస్క్: ఏపీలోని మార్కాపురం (Markapuram)లో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 13 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పరామర్శించారు. అందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా పలువురు క్షతగాత్రులతో మాట్లాడగా కీలక విషయాలు వెల్లడించారు
ఎమ్మెల్యేతో ఓ యువతి మాట్లాడుతూ ప్రమాదంపై పోలీసులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని వెల్లడించింది. 100, 108లకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదని, చివరికి 108 కు 20 సార్లు చేస్తే లిఫ్ట్ చేశారని తెలిపింది. క్షణాల్లోనే బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి, లేచి చూసే సరికి మంటలు చూసి భయపడ్డామని చెప్పింది. యువతి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పోలీసులు సకాలంలో స్పందించి, అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేసి ఉంటే కొందరైనా ప్రాణాలతో బయటపడే వారేమోనని భావిస్తున్నారు.

