కలం, ఖమ్మం బ్యూరో: ఎండమావులను తలపించే భూముల్లో ఇక గోదావరి జలాలు పారబోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, అశ్వాపురం మండలాల రైతాంగానికి సాగునీటి కల నెరవేరే సమయం ఆసన్నమైంది. పాలకులు, అధికారుల సమన్వయానికి తోడు నాయకుల పట్టుదల తోడవడంతో మారెళ్లపాడు (Marellapadu) లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 23న మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఈ ప్రాజెక్టు ప్రతిపాదన దశ నుంచి నేటి రూపకల్పన వరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. పనుల నాణ్యత, పురోగతిపై అధికారులతో అనేకసార్లు సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రాజెక్టు వద్దే తిష్ఠ వేసి పనులను నిరంతరం పర్యవేక్షించారు. సాంకేతిక సమస్యలపై దృష్టి సారించి, ట్రయల్ రన్ విజయవంతమయ్యేలా చేశారు.
సీతారామ ప్రాజెక్టులో భాగంగా రూ.180.47 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ఇంజినీరింగ్ అద్భుతం గోదావరి నీటిని దిగువ నుంచి ఎత్తైన ప్రాంతాలకు మళ్లించనుంది. మెఘా ఇంజినీరింగ్ సంస్థ రూ.25 కోట్లతో నిర్మించిన పంప్‌హౌస్‌లో 1.80 మెగావాట్ల సామర్థ్యం గల రెండు భారీ మోటార్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 39 మీటర్ల ఎత్తు వరకు నీటిని తోడి, సెకనుకు 180 క్యూసెక్కుల నీటిని కొండ కింద ఉన్న డెలివరీ సిస్టర్న్‌లోకి పంపుతారు. అక్కడి నుంచి నీరు కాలువల ద్వారా పొలాల్లోకి చేరుతుంది.
ఈ పథకం ద్వారా మణుగూరు, అశ్వాపురం మండలాల్లోని తొమ్మిది గ్రామాలు, పది చెరువులకు మహర్దశ పట్టనుంది. ఈ నిర్మాణం ద్వారా 10 కిలోమీటర్ల కాలువల ద్వారా మొత్తం 16,180 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇందులో 9.65 కిలోమీటర్ల కుడి కాలువ ద్వారా 11,915 ఎకరాల నూతన ఆయకట్టుకు నీరందుతుంది. ఎడమ కాలువ ద్వారా తుమ్మల చెరువును నింపి 4,266 ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించనున్నారు. నెల్లిపాక, అశ్వాపురం, అమ్మగారిపల్లి వంటి గ్రామాల రైతులు ఈ పథకంతో నేరుగా లబ్ధి పొందనున్నారు.
ప్రస్తుతం ప్రధాన కాలువల నిర్మాణం టెండర్ల దశలో ఉన్నప్పటికీ, రైతుల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం తొలిదశ ప్రణాళికను అమలు చేస్తోంది. లిఫ్ట్ ద్వారా ముందుగా నీటిని తుమ్మల చెరువుకు తరలించి, దాని కింద ఉన్న 5,000 ఎకరాలకుపైగా స్థిరీకృత ఆయకట్టుతోపాటు మరో 2,000 ఎకరాలకు, అంటే మొత్తంగా 7,000 ఎకరాలకు తక్షణమే నీరందించనున్నారు. కాలువల పనులు పూర్తయిన తర్వాత మిగిలిన ఆయకట్టుకూ నీరు అందుబాటులోకి వస్తుంది.
ట్రయల్ రన్ సఫలమై కాలువల్లోకి నీరు చేరడంతో అశ్వాపురం, మణుగూరు ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. నీరు లేక బీడుగా మారిన వేలాది ఎకరాల భూములు ఇకపై పచ్చని పంట పొలాలుగా మారనున్నాయి. చెరువులు జలకళ సంతరించుకోవడంతో భూగర్భ జలాలు పెరిగి, తమ దశాబ్దాల కష్టాలు తీరబోతున్నాయని స్థానిక రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

