కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: తీవ్రమైన ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు ఒక్కోసారి రైతన్నలకు తీవ్ర నిరాశను మిగులుస్తుంటాయి. అయితే ప్రకృతిని నమ్ముకుని నిరుత్సాహపడకుండా, సరైన శాస్త్రీయ పద్ధతులు, అధునాతన నీటి యాజమాన్య ప్రణాళికలు అవలంబిస్తే ఏ కష్టకాలంలోనైనా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చని మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం జీనుగురాల (Jeenugurala) గ్రామానికి చెందిన ఆదర్శ రైతు గొల్ల శ్రీనివాసులు చేతల్లో నిరూపించారు.
సెప్టెంబర్ 2022లో 4 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు (Oil Palm Farming) చేపట్టిన శ్రీనివాసులు ప్రారంభం నుంచి తోటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే 2026 జూన్ నుండి జిల్లాలో వర్షాలు లేక తీవ్రమైన ఎల్-నినో పరిస్థితులు, వడగాల్పులు ఏర్పడడంతో తోటల సాగు పెద్ద సవాలుగా మారింది. ఈ క్లిష్ట సమయంలో ఆయన ఆందోళన చెందకుండా తక్షణ నీటి యాజమాన్య ప్రణాళికను అమలులోకి తెచ్చారు. తన పొలంలో ప్రత్యేకంగా ఒక ఫారంపాండ్ (వ్యవసాయ గుంట) తవ్వించి, దానికి రెండు బోర్‌వెల్స్‌ను అనుసంధానించారు. భూగర్భ జలాలను ఆ ఫారంపాండ్‌లో నిల్వ చేసుకుని, డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం) ద్వారా క్రమం తప్పకుండా ప్రతి మొక్కకూ నీటిని అందించారు. అంతేకాకుండా, బిందు సేద్యం ద్వారానూ ఫర్టిగేషన్ (ఎరువుల యాజమాన్యం) పద్ధతిని పాటించడం వల్ల ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ మొక్కలకు ఎలాంటి తేమ లోపం రాలేదని, తోట పచ్చదనంతో కళకళలాడిందని ఆయన తెలిపారు.
ఈ పట్టుదల, సమర్థవంతమైన నిర్వహణ ఫలితంగా గత ఏడాది కాలం నుండి ఈ తోట ద్వారా క్రమంగా ఆయిల్ పామ్ గెలల దిగుబడి రావడం ప్రారంభమైంది. ఈ నాలుగు ఎకరాల సాగు కోసం మొత్తం రూ. 2.5 లక్షల పెట్టుబడి పెట్టగా, ఏకంగా 24 మెట్రిక్ టన్నుల తాజా ఆయిల్ పామ్ గెలల (ఎఫ్ ఎఫ్ బి) దిగుబడి సాధించారు. టన్నుకు సగటున రూ. 18,000 మార్కెట్ ధర లభించడంతో రూ. 5.25 లక్షల స్థూల రాబడి వచ్చిందని, అన్ని ఖర్చులు పోను నికరంగా రూ. 2.75 లక్షల లాభం ఆర్జించినట్లు శ్రీనివాసులు ఆనందం వ్యక్తం చేశారు. కష్టకాలంలోనూ లభించిన వనరులను సద్వినియోగం చేసుకుని, ఆధునిక పద్ధతులతో ఆయిల్ పామ్ సాగులో మంచి లాభాలు గడిస్తున్న గొల్ల శ్రీనివాసులు నేడు తోటి రైతులందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు.

