ఆసియా గేమ్స్‌లో మన్‌ప్రీత్ కౌర్‌కు కాంస్య పతకం

కలం, స్పోర్ట్స్​ : భారత సీనియర్ అథ్లెట్ మన్‌ప్రీత్ కౌర్ (Manpreet Kaur) ఆసియా గేమ్స్‌లో శుక్రవారం కాంస్య పతకంతో మెరిసింది. మహిళల షాట్‌పుట్ ఫైనల్‌లో ఇనుప గుండును 17.17 మీటర్ల దూరం విసిరి మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. తన నాలుగో ప్రయత్నంలో మన్‌ప్రీత్ ఈ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. చైనాకు చెందిన సాంగ్ జియాయువాన్ స్వర్ణం, జాంగ్ లిన్‌రూ రజతం సాధించారు. భారతదేశానికే చెందిన యంగ్ అథ్లెట్ కృష్ణ జయశంకర్ మీనన్ 16.57 మీటర్ల ప్రదర్శనతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.

మన్‌ప్రీత్ కెరీర్‌లో ఒడిదొడుకులు చాలా ఉన్నాయి. 2016 ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఆమె, 2017 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గింది. అయితే డోపింగ్ పరీక్షలో విఫలం కావడంతో ఆమెపై నాలుగేళ్ల నిషేధం పడింది. దాంతో సాధించిన పతకాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. అయినా సరే అధైర్యపడకుండా 2022లో రీఎంట్రీ ఇచ్చింది. 18.06 మీటర్ల ప్రదర్శనతో జాతీయ రికార్డును నెలకొల్పింది. అదే ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో 11వ స్థానంలో, గత ఆసియా గేమ్స్‌లో ఐదో స్థానంలో నిలిచింది.

2023 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో 17.00 మీటర్లతో కాంస్యం గెలుపొందింది. ఇటీవల జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో తృణంలో పతకం చేజార్చుకుని నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.ప్రస్తుత సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న మన్‌ప్రీత్, నేషనల్ ఇంటర్-స్టేట్ ఛాంపియన్‌షిప్‌లో 17.75 మీటర్ల దూరం విసిరి ఆసియా గేమ్స్‌కు అర్హత సాధించింది.

తాజా కాంస్యంతో ఆసియా గేమ్స్ షాట్‌పుట్‌లో పతకం సాధించిన మూడో భారతీయ మహిళగా మన్‌ప్రీత్ నిలిచింది. అంతకుముందు బార్బరా వెబ్‌స్టర్ (1951), కిరణ్ బలియాన్ (2022) మాత్రమే ఈ ఘనత సాధించారు.అనేక అవరోధాలను అధిగమించి మన్‌ప్రీత్ సాధించిన ఈ విజయం భారత అథ్లెటిక్స్ రంగానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>