Mobile Popup Ad
Mobile Popup Ad

అధికారం, అవినీతి ఇదే బీజేపీ నీతి !: త్రిపుర మాజీ సీఎం

కలం ,మహబూబ్ నగర్ బ్యూరో : అధికారం, అవినీతి ఇదే బీజేపీ నీతిగా దేశవ్యాప్తంగా సాగిస్తున్నారని సీపీఎం జాతీయ నాయకులు, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ ఆరోపించారు. ప్రజాస్వామ్యం పైన రాజ్యాంగం పైన ప్రజల హక్కుల పైన దాడి చేస్తూ.. విభజన రాజకీయాలతో దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని ఆయన విమర్శించారు. శనివారం మహబూబ్‌‌నగర్‌ (Mahabubnagar) ‌జిల్లా కేంద్రంలోని ఎంబీసీ గ్రౌండ్‌‌లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య అధ్యక్ష‍తన ఆ సంఘం బహిరంగ సభను నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన మాణిక్‌ ‌సర్కార్‌ ‌మాట్లాడుతూ.. దేశంలో అత్యంత పేదలు వ్యవసాయ కార్మికులనేననీ, వారు బట్టలు, తిండి, ఇల్లు వంటి ప్రాథమిక అవసరాలను కూడా తీర్చుకోలేక అర్థాకలితో పస్తులుంటూ దుర్భర స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారి పక్ష‍ాన పోరాడుతున్నది ఎర్రజెండానే అని నొక్కి చెప్పారు. వామపక్ష‍ పార్టీల ఎంపీల ఒత్తిడితో యూపీఏ-1 ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తుచేశారు. గ్రామీణ పేదలు ఆత్మ గౌరవంతో జీవించడం ఇష్టం లేక ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. దీంతో వ్యవసాయ కార్మికులు మళ్లీ రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.

మోదీ సర్కారు విధానాలతో వీరే కాకుండా సామాన్యులు కూడా ఓవైపు నిత్యావసర ధరల పెరుగుదలతో, ఇంకో వైపు ఉపాధి గ్యారంటీ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల కష్టాలు కేంద్రంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌‌కు పట్టడం లేదనీ, ఆ ప్రభుత్వానికి పేదల కష్టాలు తీర్చడం కంటే కార్పొరేట్లకు లాభాలు చేకూర్చడమే ప్రథమ ధ్యేయంగా మారిందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యం కాకుండా కులం, మతం, ప్రాంతం పేర్లతో విద్వేషపూరిత రాజకీయాలు చేస్తూ లబ్దిపొందుతున్నదని, ఈ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూపరిషత్‌‌లు దానికి సహకరిస్తున్నాయని ఎండగట్టారు.

ప్రజాస్వామ్యంపై దాడిని బీజేపీ తీవ్రం చేసిందని, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసి తనకు అనుకూలంగా మలుచుకుని ప్రశ్నించే గొంతుకలపై సీబీఐ, ఈడీ, తదితర మార్గాల ద్వారా దాడి చేయిస్తున్నదని విమర్శించారు. మీడియా గొంతును నొక్కేస్తున్నదని అన్నారు. అదే సమయంలో స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఈసీని తన గుప్పిట్లో పెట్టుకుని ఓటర్ల సవరణ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకును తొలగించి బీహార్‌, పశ్చిమబెంగాల్‌, తదితర రాష్ట్రాల్లో అధికారం పొందిన తీరును వివరించారు. ఈ క్రమంలో సహకరించే వారికి ఆ తర్వాత పదవులు కట్టబెడుతున్న తీరును దుయ్యబట్టారు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారం కోసం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న ఆగడాలు ఎల్లకాలం చెల్లవని, ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడుతున్నాయని హెచ్చరించారు.

బీజేపీ పెరగట్లేదు.. కాంగ్రెస్‌ ‌పెంచుతోంది…

చాలా రాష్ట్రాల్లో బీజేపీ బలం పెరగ లేదనీ, కాంగ్రెస్‌ ‌పార్టీనే పెంచుతున్నదని మాణిక్ సర్కార్‌ ‌విమర్శించారు. దానికి ప్రత్యక్ష‍ ఉదహరణ త్రిపురనేనని చెప్పారు. త్రిపురలో 42 శాతంగా ఉన్న కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు మొత్తం బీజేపీ ఓటు బ్యాంకుగా మారిందని, కమ్యూనిస్టులను తాము ఓడగొట్టలేమన్న నిర్ణయంతోనే ఇలా వ్యవహరించినట్టు అర్థమవుతున్నదని తెలిపారు. అదే సమయంలో సీపీఐ(ఎం) 5 నుంచి 7 శాతం ఓటింగ్‌‌నే కోల్పోయిందని తెలిపారు. అయితే, పార్టీ క్రమంగా పుంజుకుంటున్నదని చెప్పారు. అక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనీ, ఆ పార్టీ మోసాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. లెఫ్ట్‌ ‌గవర్నమెంట్‌ ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను రెగ్యులర్‌‌గా నిర్వహించేందని, బీజేపీ ప్రభుత్వం వాటికి ఎన్నికలు నిర్వహించడం లేదని విమర్శించారు.

త్రిపురలో శాంతిభద్రతలు క్ష‍ీణిస్తున్నాయని, ప్రతిపక్ష‍ంపై దాడి తీవ్రం చేసిందని, ఈ పరిస్థితి దేశవ్యాప్తంగానూ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ సర్కారు రాజ్యాంగ సంస్థలపై చేస్తున్న దాడిని, కూలీల హక్కులను కాలరాస్తున్న విధానాన్నీ, మనువాద సిద్ధాంతాన్ని ఎండగడుతూ ప్రజలంతా ఐక్యంగా రోడ్లెక్కి పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం కూడా ప్రజల్లోకి పోరాటాలను ఉధృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తమ్మినేని వీరభద్రం, మాజీ పార్లమెంట్ సభ్యులు , బి. వెంకట్ AIAWU జాతీయ ప్రధాన కార్యదర్శి ,జాన్ వేస్లీ, KVPS రాష్ట్ర అధ్యక్షులు ,శివదాసన్, ఎంపీ జాతీయ నాయకులు AIAWU,టి. సాగర్, AIKS రాష్ట్రా ప్రధాన కార్యదర్శి ,పి. జయలక్ష్మి, CITU రాష్ట్ర కార్యదర్శి,R. వెంకట్రాములు, AIAWU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి B.ప్రసాద్ AIAWU రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎ. రాములు రైతుసంఘం మహబూబ్నగర్ జిల్లా నాయకులు , జి. వెంకటరామిరెడ్డి CITU నారాయణ పేట జిల్లా నాయకులు ,వెంకటస్వామి, రైతు సంఘం గద్వాల్ జిల్లా నాయకులు
బి. పద్మ, మహిళ కూలీల రాష్ట్ర కన్వీనర్ ,ఎం ఆంజనేయులు జాతీయ కౌన్సిల్ సభ్యులు ,యు గోపాల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ,పి నరసింహ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి, కే మోహన్ మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి, బి రాజు గద్వాల జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>