కలం, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో అరుదైన, ఆసక్తికర వివాహం జరిగింది. కొండగావ్ జిల్లాలో ఒక యువకుడు ఒకే వేదికపై ఇద్దరు యువతులను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొండగావ్ కు చెందిన హితేశ్ యాదవ్ అనే యువకుడు కొంతకాలంగా ఫూల్‌వతి అనే యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమె మొదట అతని ప్రేమను తిరస్కరించింది. దీంతో హితేశ్ కుటుంబ సభ్యులు యామిని అనే మరో యువతితో అతని వివాహం జరపాలని నిర్ణయించారు. ఇరు కుటుంబాలు మాట్లాడుకుని పెళ్లి ఏర్పాట్లు పూర్తిచేసి, ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు.
పెళ్లి రోజున, వేడుకలు జరుగుతున్న సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ముందుగా నిరాకరించిన ఫూల్‌వతి తన నిర్ణయాన్ని మార్చుకుని హితేశ్ నే పెళ్లి చేసుకొనేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఇరు కుటుంబాలు పరస్పరం చర్చించుకుని, ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఒక నిర్ణయానికి వచ్చాయి.
చివరకు పెద్దల సమక్షంలో, ఇరు కుటుంబాల అంగీకారంతో హితేశ్ యాదవ్ ఒకే వేదికపై ఫూల్‌వతి, యామిని ఇద్దరి మెడలో తాళి కట్టి వివాహం చేసుకున్నాడు.
సాధారణంగా ఒకే వ్యక్తి ఇద్దరిని ఒకేసారి వివాహం చేసుకోవడం అరుదైన విషయం కావడంతో ఈ వివాహం ప్రస్తుతం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది.

