కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఒక నిరంతర ప్రక్రియగా సాగుతోందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్షల కోట్లు అప్పులు తమ ప్రభుత్వ నెత్తిన పెట్టి పోయినా, ఎల్ నినో వంటి విపత్కర పరిస్థితులు వచ్చినా స్కీం ఆగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేద లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తుందని చెప్పారు.
గురువారం హైదరాబాద్ శివారుప్రాంతం రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని లబ్దిదారుల కోసం మైలార్ దేవుపల్లిలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ (Indiramma Towers) నిర్మాణానికి మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి పొంగులేటి శంకుస్ధాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ టవర్స్ లబ్దిదారుల ఎంపిక కోసం లక్కీడ్రా నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఇల్లు నిర్మించుకోవడం జీవితాశయంగా ఉంటుందని, పేదల ఆశలను తమ ప్రభుత్వం నేరవేరుస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని కోట్లాది రూపాయిల విలువచేసే ప్రాంతాల్లో శంకుస్ధాపనలు పూర్తిచేసుకున్న ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలను వచ్చే దీపావళికల్లా పూర్తి చేస్తామని చెప్పారు.
లబ్దిదారులు కంట ఆనందబాష్పాలు చూస్తుంటే తమకు కూడా కళ్లు చెమరుస్తున్నాయని.. నిరుపేదలఆనందభాష్పాలే తమకు ఆశీస్సులని పొంగులేటి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో లబ్దిదారుల ఇళ్లలో దీపావళి జరుపుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. పేదల అభ్యున్నతి కోసం మరో మూడు విడతలు అయినా ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలోని 23 నియోజకవర్గాలలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా, కులమతాలు, పార్టీల బేధాలు లేకుండా కేటాయింపు జరుగుతోందని అన్నారు.

