కలం, నిర్మల్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ‘సున్హరి మిట్టి అభియాన్’ జాతీయ కార్యక్రమంలో మామడ మండలం కొరిటికల్ (Koratikal) గ్రామానికి చెందిన పసుపు రైతులు పాల్గొన్నారు. తెలంగాణ గవర్నర్ ప్రతాష్ శుక్ల ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పసుపు సాగు చేస్తున్న రైతులతో సమావేశమై వారి సాగు విధానాలను తెలుసుకున్నారు. కొరటికల్ పసుపు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ చైర్మన్ సామల భీమారెడ్డి, వైస్ చైర్మన్ ఏలూరి రాజారెడ్డి, డైరెక్టర్లు దన్నూరి రాజారెడ్డి, కాట్ల ప్రభాకర్ రెడ్డి, దేవోళ్ల గంగన్న తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రస్తుతం 20 ఎకరాల్లో ప్రకృతి పద్ధతిలో పసుపు సాగు చేస్తున్న రైతులు, రానున్న ఖరీఫ్ సీజన్ నాటికి సాగును 100 ఎకరాలకు విస్తరించేందుకు గవర్నర్ సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడేందుకు జీవామృతం, వర్మీ కంపోస్ట్, పశువుల ఎరువు, వృక్ష సంబంధ కషాయాలను వినియోగించాలని గవర్నర్ సూచించారు. అనంతరం ప్రకృతి పద్ధతిలో పసుపు సాగు చేస్తున్న రైతులకు మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, కార్యదర్శి భవానిశ్రీ, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, ధనపాల్ సూర్యనారాయణ, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, పసుపు బోర్డు డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యూష్ తదితరులు పాల్గొని రైతులను అభినందించారు.

